హైదరాబాద్, (ఆంధ్రప్రభ) : జంట నగరాలుగా ప్రఖ్యాతి గాంచిన హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో సుమారు ఆరు దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర ఉన్న ప్రఖ్యాత సాంస్కృతిక కళావేదిక త్యాగరాయ గానసభలో ఇటీవల మంగళమయ ముహూర్తంలో శృంగేరీ పండితుల వైదికమంత్రాల మధ్య ప్రతిష్ఠించిన శ్రీఅభయ గణపతి దేవాలయంలోని కృష్ణశిల అభయ గణపతికి గత వారంరోజులుగా కళాకారుల అభివాదాల జోరు పెరిగింది.
ఈనాటికీ కళా, సాహిత్య ఆధ్యాత్మికరంగాలకు చెందిన కార్యక్రమాలు సుమారు రోజూ మూడు జరిగే త్యాగరాయ గానసభకు సుదీర్ఘమైన అద్భుత సాంస్కృతిక చరిత్ర ఉందనేది నిర్వివాదాంశం. గత దశాబ్దకాలంగా గానసభ అధ్యక్షులు కళా జనార్ధనమూర్తి త్యాగరాయ గానసభను అనేక రకాలుగా, వేల కళాకారులకు ఉపయోగపడేలా వివిధ కోణాల్లో అభివృద్ధి చేస్తున్న అంశాలు కోట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి.
గత, ప్రస్తుత ముఖ్యమంత్రులు మర్రి చెన్నారెడ్డి, ఎన్టీఆర్, చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి, కేసీఆర్‌లతో పాటు ఎందరో సాహిత్య సినీసంగీత నాట్య దిగ్గజాలు విశ్వనాథ సత్యనారాయణ, మధునాపంతులు, జగ్గయ్య, సి.నారాయణరెడ్డి, కేవీ.రమణాచారి, అక్కినేని నాగేశ్వరరావు, చిరంజీవి, బాలకృష్ణ, కోట శ్రీనివాసరావు, కైకాల సత్యనారాయణ, సుబ్బరామిరెడ్డి, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పీ.సుశీల, ఎస్.జానకి, సిరివెన్నెల సీతారామశాస్త్రి, ఎంఎం.కీరవాణి, సుద్దాల అశోకతేజ, చంద్రబోస్, వాడ్రేవు చినవీరభద్రుడు, తనికెళ్ళ భరణి, శోభానాయుడు, మంజుభార్గవి వంటి ఎందరో ప్రముఖుల ప్రసంగాలు, గ్రంథావిష్కరణలు, పాటల కచేరీలు, నాట్య వైభవాలతో ఈ కళా స్థలం పులకరించి పోయిందని కళా జనార్ధనమూర్తి చెప్పారు.
ఇటీవల త్యాగరాయ గానసభ కమిటీ ఆధ్వర్యంలో ఈ ప్రాంగణంలో అతి అరుదైన కృష్ణశిలతో నిర్మించిన అభయ గణపతి ఆలయంలో ప్రసన్నంగా ఆశీనులైన అభయ గణపతి మంగళ విగ్రహానికి పవిత్ర పుష్పార్చనతో ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారు పురాణపండ శ్రీనివాస్ ప్రతిష్ఠా ప్రారంభోత్సవ శ్రీకార్యాన్ని ప్రారంభించిన శిలా ఫలకాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం అందరినీ ఆకర్షిస్తోంది.
గత వారంరోజులుగా వస్తున్న ప్రతీ కళాకారుడు ఆలయం ముందు చెప్పులు విప్పి నమస్కరించుకుని ఆడిటోరియంలోకి వెళ్లడం మనకు కనిపిస్తోంది. కళా జనార్ధన మూర్తి విగ్రహ ప్రతిష్ఠాపన సమయంలో పవిత్రమయ
హోమాలు నిర్వహించడం వల్ల ఈ ప్రాంతంలో మరొక శోభాయమాన విగ్రహాలను ప్రతిష్ఠించే అవకాశం కనిపిస్తోంది.
అయితే అసూయ, ద్వేషాలపై ఎప్పుడూ ఘాటైన విమర్శలు చేసే ప్రముఖ రచయిత, అమోఘమైన వక్త, పుస్తక మాంత్రికుడు పురాణపండ శ్రీనివాస్ స్వచ్ఛమైన హృదయం ఉన్న ప్రతిభాశాలిగా జంట నగరాల కళా సాహిత్య వాతావరణంలో ఉన్న సంస్కారప్రదమైన అంశాన్ని ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని పురాణపండ శ్రీనివాస్‌చే ఈ మనోహరమైన విగ్రహాన్ని ప్రతిష్ఠింప చేసినట్లు సమాచారం.
గత దశాబ్దకాలంగా శ్రీనివాస్ రచనా సంకలనాలు సుమారు పది ఆర్షధార్మిక గ్రంథాలను వేల మంది రసజ్ఞులకు ఉచితంగా అందించామని, అనూహ్యమైన స్పందన వచ్చినట్లు గానసభ కమిటీ పేర్కొంటోంది. ఏదేమైనా చారిత్రాత్మక రాజమహేంద్రవరానికి చెందిన ఆధ్యాత్మిక పుంజీభూత చైతన్యమైన పురాణపండ శ్రీనివాస్‌కి ఆరు దశాబ్దాలుగా ఎవరికీ దక్కని పవిత్ర ఘనత దక్కడం శ్రీనివాస్ నిర్విరామ అసాధారణ అద్భుత కృషిగా చెప్పక తప్పదు.