jagruthi | బీఆర్ఎస్‌పై క‌విత‌క్క ఫైర్‌

బీఆర్ఎస్‌పై క‌విత‌క్క ఫైర్‌

jagruthi | వెబ్‌డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : బీఆర్ఎస్ పార్టీ ‘గుంట నక్క’ను నమ్మి గుడ్డిగా గోతిలో పడిందని, ప్రజలే త్వరలో ఆ పార్టీని నిషేధిస్తారని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఒక జోక్‌లా మారిందని మండిపడ్డారు. అసలు టెర్రరిస్టుల నిఘా కోసం ఉండాల్సిన ట్యాపింగ్‌ను అన్ని రాజకీయ పార్టీలు తమ స్వార్థం కోసం దుర్వినియోగం చేస్తున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ జాగృతి కార్యాలయంలో కవిత మీడియాతో మాట్లాడుతూ.. నైనీ బొగ్గు గని వ్యవహారంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా వార్తలు వేసిన ఒక ఛానెల్ కార్యాలయంపై కేటీఆర్ అనుచరులు దాడి చేయడాన్ని ఆమె ప్రస్తావించారు. కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టగానే, దానికి కౌంటర్ ఇవ్వడానికి కేటీఆర్ (గుంట నక్కగా అభివర్ణిస్తూ) హుటాహుటిన ప్రెస్ మీట్ పెట్టారని ఎద్దేవా చేశారు.

నైనీ బొగ్గు గని 2015లో తెలంగాణకు కేటాయించబడిందని, అంతకుముందు అది గుజరాత్ వద్ద ఉండేదని ఆమె గుర్తు చేశారు. బీఆర్ఎస్ హయాంలోనే డీజిల్ టెండర్లు ఉన్నాయని, వారి కాలంలోనే 25 టెండర్లు పొడిగించబడ్డాయని వెల్లడించారు. ఒక పెద్ద తిమింగలాన్ని (మెగా కృష్ణా రెడ్డిని ఉద్దేశించి) కాపాడటం కోసమే చిన్న చేపను పట్టుకొని నాటకాలు ఆడుతున్నారని ఆమె ఆరోపించారు. నైనీ బొగ్గు టెండర్ విలువ దాదాపు రూ. 25 వేల కోట్లు అని, సింగరేణికి ఉన్న 19 ఓపెన్ కాస్ట్, 22 అండర్ గ్రౌండ్ మైన్లను నిర్వీర్యం చేసేలా కుట్ర జరుగుతోందని మండిపడ్డారు.

సింగరేణి సంస్థ ప్రయోజనాల దృష్ట్యా కవిత పలు కీలక డిమాండ్లు చేశారు. మైన్ డెవలపర్ అండ్ ఆపరేటర్ (MDO) విధానాన్ని వెంటనే రద్దు చేయాలని, ప్రైవేట్ కంపెనీలకు మైన్లను కట్టబెట్టడాన్ని ఆపాలని కోరారు. తాడిచెర్ల ఓపెన్ కాస్ట్‌లో గ్రేడ్-9 బొగ్గు ఉన్నప్పటికీ, దానిని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారని ధ్వజమెత్తారు. తెలంగాణలోని అన్ని బొగ్గు ప్రాంతాలను సింగరేణికే కేటాయించాలని, కోల్ ఇండియా కంటే మెరుగైన వసతులు సింగరేణి కార్మికులకు కల్పించాలని డిమాండ్ చేశారు.

Leave a Reply