మెదక్ : జగ్జీవన్ రామ్ జీవితం నేటి తరానికి స్పూర్తిదాయకమని, దేశానికి ఆయన చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచి ఉంటాయని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు, దేశ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జగ్జీవన్ రామ్ విగ్రహానికి మంత్రి దామోదర రాజనర్సింహ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల జగ్గారెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ… పేద కుటుంబంలో జన్మించిన ఆయన, అత్యున్నత స్థాయికి ఎదిగిన తీరు, దేశ తొలి కార్మిక శాఖ మంత్రిగా, ఉప ప్రధానిగా ఆయన చేసిన నిస్వార్థ సేవ గురించి నేటి తరం పిల్లలు తెలుసుకోవాలన్నారు. సుదీర్ఘ కాలం మంత్రిగా పనిచేసిన జగ్జీవన్ రామ్ సామాజిక సమానత్వం కోసం, దళితుల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేశారని మంత్రి గుర్తు చేశారు. ఆ మహనీయుని ఆశయాలను నెరవేర్చే దిశగా తమ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. సామాజిక న్యాయ సాధనలో భాగంగా ఇప్పటికే బీసీ కుల గణన, ఎస్సీ వర్గీకరణ చేపట్టామని గుర్తు చేశారు. ఇదే స్పూర్తితో ముందుకెళ్తామన్నారు.


