జడేజా ఎమోషనల్ పోస్ట్

జడేజా ఎమోషనల్ పోస్ట్
భారత క్రికెటర్ రవీంద్ర జడేజా తన సతీమణి రివాబా జడేజా, జామ్‌నగర్ ఉత్తర ఎమ్మెల్యే, గుజరాత్ ప్రభుత్వంలో మంత్రిగా నియమితులైన సందర్భంగా తన సంతోషాన్ని, గర్వాన్ని వ్యక్తం చేశారు. మంత్రి పదవి దక్కినందుకు తన భార్యకు అభినందనలు తెలుపుతూ ఆయన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
జడేజా తన పోస్ట్‌లో.. ““నీ పట్ల, నీ విజయాల పట్ల చాలా గర్వంగా ఉంది. నువ్వు ఇలాగే అద్భుతమైన పని చేస్తూ అన్ని వర్గాల ప్రజలకు ప్రేరణగా నిలుస్తావని నాకు తెలుసు. గుజరాత్ ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా నీకు గొప్ప విజయం కలగాలని కోరుకుంటున్నాను. జై హింద్” అని పేర్కొన్నాడు.
రివాబాకు కీలక శాఖ అప్పగింత…
గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రభుత్వం శుక్రవారం (అక్టోబర్ 17) భారీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టింది. ఈ క్రమంలో కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన 25 మంది మంత్రులకు శాఖలు కేటాయించారు.
టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య, జామ్‌నగర్ ఉత్తర ఎమ్మెల్యే అయిన రివాబా జడేజాకు కీలకమైన విద్యా శాఖ బాధ్యతలు అప్పగించారు. రాజకీయాల్లోకి వచ్చిన కొద్ది కాలంలోనే ఆమెకు ఇంత ముఖ్యమైన బాధ్యత దక్కడం గమనార్హం.
2027లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ ఈ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టినట్లు తెలుస్తోంది. మొత్తం 26 మందితో కూడిన ఈ మంత్రివర్గంలో సామాజిక, ప్రాంతీయ సమతుల్యతకు పెద్దపీట వేశారు.
కొత్త మంత్రివర్గంలో 7 మంది పాటిదార్లకు, 8 మంది ఓబీసీలకు, 3 మంది ఎస్సీలకు, 4 గురు ఎస్టీలకు అవకాశం కల్పించారు.
