చెంగాలమ్మ ఆలయంలో ఇస్రో చైర్మన్…

  • భారత్ శాస్త్ర దిశలో మరో మైలురాయి
  • ఎల్‌వీఎం3–ఎం5 ప్రయోగ విజయానికి ప్రత్యేక పూజలు..
  • టెలికమ్యూనికేషన్‌ విస్తరణకు ఎల్‌వీఎం3–ఎం5 కీలకం

సూళ్లూరుపేట, (ఆంధ్రప్రభ) : సూళ్లూరుపేటలోని శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి దేవాలయాన్ని ఇస్రో చైర్మన్ నారాయణన్ శనివారం రాత్రి దర్శించుకున్నారు. ఆదివారం జరగనున్న ఎల్‌వీఎం3-ఎం5 రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని ప్రత్యేక పూజలు చేశారు.

ఆలయానికి చేరుకున్న ఇస్రో చైర్మన్ నారాయణన్, శాస్త్రవేత్తలకు ఆలయ కార్యనిర్వాహణాధికారి లక్ష్మీ ప్రసన్న ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వారికి సత్కారం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు.

ఈ సందర్భంగా నారాయణన్ మాట్లాడుతూ, ఎల్‌వీఎం3-ఎం5 రాకెట్ ప్రయోగం సాయంత్రం 5.26 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైందని తెలిపారు. ఈ ప్రయోగం కేవలం ఇస్రోకే కాదు, భారత సాంకేతిక ప్రతిభకు, దేశ ఆత్మవిశ్వాసానికి, భవిష్యత్ శాస్త్ర దిశకు ఒక మైలురాయి అవుతుందని పేర్కొన్నారు.

ఈ రాకెట్ ప్రయోగం ద్వారా దేశంలోని అన్ని ప్రాంతాలకు అధునాతన టెలికమ్యూనికేషన్ సేవలు, సముద్ర ప్రాంతాలకు కనెక్టివిటీ విస్తరణ కలుగుతుందని వివరించారు. 2025 డిసెంబర్‌లో అమెరికాకు చెందిన బ్లూ బర్డ్ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నట్లు తెలిపారు.

ఎల్‌వీఎం-3 వాహనం ద్వారా త్వరలో 6,000 కిలోల బరువు కలిగిన కొత్త కమ్యూనికేషన్ శాటిలైట్‌ను అంతరిక్షంలోకి పంపనున్నామని తెలిపారు. ఈ ఏడాదిలోనే మరో ఏడు రాకెట్ ప్రయోగాలు చేపట్టనున్నట్లు నారాయణన్ వెల్లడించారు.

ఇస్రో వరుస రాకెట్ ప్రయోగాలతో దేశ సాంకేతిక ప్రతిభను ప్రపంచానికి చాటుతూ ముందుకు దూసుకుపోతుందని నారాయణన్ అన్నారు.

ఈ కార్యక్రమంలో గణపతి బాయ్ పటేల్, షార్ డైరెక్టర్ పద్మకుమార్, గ్రూప్ మేనేజర్ గోపీకృష్ణ, ఇస్రో శాస్త్రవేత్తలు, ఏఎంసీ చైర్మన్ ఆకుతోట రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply