అమెరికా… భూతల స్వర్గం… చదువుకునేవారికైనా, వృత్తి-వ్యాపారాల్లో స్థిరపడాలనుకునేవారికైనా. ఒక్క భారతీయులకే కాదు, ప్రపంచంలోని చాలా దేశస్థులకు. అక్కడి వీసా (Visa) కోసం ఎంతైనా ఖర్చుపెడతారు. ఎన్ని ప్రయాసలైనా పడతారు. చివరకు అక్రమంగా అయినా ఆ దేశంలోకి ప్రవేశిస్తారు. అందరి అంతిమ లక్ష్యం ఒక్కటే… అమెరికాలో స్థిరపడాలి… బోలెడన్ని డాలర్లు (Dollars) పోగేసుకోవాలి. డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అధ్యక్షుడయ్యే దాకా అమెరికా తలుపులు దాదాపు తెరిచే ఉన్నాయి. అందరికీ కాకపోయినా కొందరికైనా మార్గం సుగమంగానే ఉండేది. కానీ, ట్రంప్ ఆలోచనా ధోరణితో సీన్ రివర్స్ (Sean Rivers) అయ్యింది. నిబంధనలు కఠినతరం అయ్యాయి… దారులన్నీ కష్టమయ్యాయి. కొన్నిసార్లు చేరతామో లేదో కూడా చెప్పలేని పరిస్థితులు మొదలయ్యాయి.
ఎందుకీ పరిస్థితి ?
అంటే “అమెరికన్స్ ఫస్ట్ ” (Americans first) అనే ట్రంప్ విధానమే ప్రధాన కారణం. వలసదారులపై ఉక్కుపాదం మోపడం వారి దేశాలకు చాలా అవమానకర రీతుల్లో పంపించేయడం.. వీసాల నిబంధనలను కఠినతరం చెయ్యడమే కాక, వేరే దేశం విద్యార్థులపై నిరంతర నిఘా పెట్టి, ఏ చిన్న కారణంతోనైనా వారి వీసా (Visa) రద్దు చేసి, వారి దేశానికి తిప్పి పంపేయడం. దీంతో, అక్కడి యూనివర్శిటీల్లో ఎన్ని లక్షలు కట్టినా, వీసాకు ఎంత ఖర్చు పెట్టినా, చదువు పూర్తి చేసుకుంటామన్న గ్యారెంటీ లేదు. అలాగే అప్పట్లో లాగా విద్యార్థులు పార్ట్ టైం (Part time) ఉద్యోగాలు చేసుకోవడానికి తగిన పరిస్థితులు ఇప్పుడు లేవు.
ట్రంప్ కి ఎందుకింత అక్కసు ?
ఎందుకంటే ఉదాహరణకు ఒక సంస్థ ఉంటే అందులోని ప్రధాన, కీలక స్థానాల్లో ఉన్నవారంతా భారతీయులైతే చాలావరకు చిన్నస్థాయిల్లో ఉన్నవారంతా అమెరికన్లు (Americans) కావడం ట్రంప్ కి నచ్చలేదు. వాస్తవానికి స్థాయిలు, పనులు ఉద్యోగాలు ఏవైనా జీతభత్యాల విషయంలో అమెరికన్లు ఎప్పుడైనా బానే ఉన్నారు కానీ, ఆదాయం కన్నా ఆత్మ గౌరవానికి ట్రంప్ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో ఇప్పుడిప్పుడే వారిలోనూ ఈ వివక్షా ఆలోచనలు రేకెత్తుతున్నాయి. అందుకే ఏదోవిధంగా విదేశీయులను వారివారి దేశానికి తరిమేసి, అమెరికా సొత్తు, అమెరికన్లకే పరిమితం చేసి జాతి సంపదను కాపాడాలని ట్రంప్ ఆలోచన.
ట్రంప్ ఆలోచన సరైనదేనా ? సాగేనా ?
సరైనది అయినా, కాకపోయినా, దేశాధ్యక్షుడి స్థానంలో ఉండి నిర్ణయాలు తీసుకున్నప్పుడు వాటిని అమలు పరచాల్సిన బాధ్యత యంత్రాంగానికి తప్పదు. ఆచరించాల్సిన ఆవశ్యకత ప్రజలకు తప్పదు. రేపటి రోజు ట్రంప్ (Trump) అధికారంలో ఉండకపోవచ్చు. కానీ ఈరోజు రేకెత్తించిన ఆలోచనలు, తీసుకున్న నిర్ణయాలు వాటి ఫలితాలైతే ప్రభావం చూపుతాయన్నది కఠిన వాస్తవం.
అమెరికాలోని సంపద అంతా అమెరికన్లదేనా?
కానేకాదు. అమెరికా (America) ఒక మిశ్రమ సంస్కృతుల సమ్మిళిత దేశం. అందుకే చాలా భాషలు, సంప్రదాయాలు అమెరికాలో కనిపిస్తాయి. మేధో సంపద విషయానికొస్తే వలసదారుల వల్ల జరిగిన అభివృద్ధే ఎక్కువ అనేది అమెరికా చరిత్ర చెబుతోంది. అక్కడి ధనవంతుల్లో, వ్యాపార దిగ్గజాల్లో చాలావరకు అమెరికన్లు కారు. ఆ సంగతి ట్రంప్ మరచిపోతున్నారని విమర్శలు (Criticisms) వెల్లువెత్తుతున్నాయి. అందరికీ దారులు మూసేస్తే అంతిమంగా నష్టపోయేది అమెరికానే అని సాక్షాత్తూ అమెరికన్లే ఆందోళన చెందుతున్నారు.
మరి మన భారత్ పరిస్థితి ఏమిటి?
మన భారత్ కి ఏమీకాదు. భారతీయులకు అమెరికా అనేది ఒక మోజు, ఒక ఆప్షన్ మాత్రమే. ప్రత్యామ్నాయంగా అనేక దేశాలు భారతీయులకు రెడ్ కార్పెట్ (Red carpet) పరచి ఆహ్వానిస్తున్నాయి. ఎందుకంటే వారందరికి మన భారతీయుల మేధో సంపత్తి కావాలి. నిజానికి ఏ దేశానికి వలస పోకున్నా, మన భారత్ ఒక అవకాశాల గని. ఇక్కడే వృత్తి-వ్యాపారాల్లో (Professions and businesses) అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఉత్పాదక సామర్థ్యం, మానవ వనరులు అన్నీ పుష్కలంగా ఉన్నాయి. అనేక రంగాల్లో ఉద్యోగాలు పిలుస్తున్నాయి. మన మేధస్సు వేరే దేశాలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నప్పుడు. మన తెలివి తేటలు మనకెందుకు ఉపయోగం కారాదు? వీసా కోసం పెట్టే లక్షల కొద్దీ డబ్బు పెట్టుబడిగా పెడితే ఇక్కడే ఒక చిన్న వ్యాపారం (business) ప్రారంభించవచ్చు. ఎంతో ఖర్చుపెట్టినా శాశ్వతంగా ఉండలేనప్పుడు, దోషుల్లా బిక్కుబిక్కున బ్రతుకీడుస్తూ, అడుగడుగునా జాత్యహంకారానికి గురవుతూ, ఆత్మ గౌరవాన్ని చంపుకుని అమెరికాలో బ్రతుకీడ్చేకంటే భారత్ లోని అవకాశాలను అందిపుచ్చుకుంటే బాగుంటుంది కదా… భారతీయుల్లో కూడా ఈ వైపు ఇప్పుడిప్పుడే ఆలోచనలు మళ్ళుతున్నాయి. మంచిదే. అంతిమంగా భారత్ శక్తి భారత్ కే సొంతమవుతుంది.