అమరావతిలో పొట్టి శ్రీరాములు 58 అడుగుల విగ్రహావిష్కరణ..

అమరావతిలో పొట్టి శ్రీరాములు 58 అడుగుల విగ్రహావిష్కరణ..
మంత్రి నారా లోకేష్‌కు నిర్వాహకుల ఆహ్వానం.. మార్చి 16న మహోత్సవం
ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు కు నివాళిగా అమరావతిలో భారీ కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు. రాజధాని అమరావతిలోని శాఖమూరు పార్కులో నిర్మించిన 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ మహోత్సవానికి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ను నిర్వాహకులు మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. ఉండవల్లి నివాసంలో మంత్రిని కలిసిన అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఫౌండర్, మేనేజింగ్ ట్రస్టీ ఆర్యవైశ్య సంక్షేమాభివృద్ధి సంస్థ చైర్మన్ డూండి రాకేష్, ట్రస్ట్ ప్రతినిధులు వనమా నవీన్ కుమార్, కామిశెట్టి అనిల్, బండారు నాగరాజు ఆహ్వాన పత్రికను అందజేశారు.
పొట్టి శ్రీరాములు 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును నిర్మించారు. ఆయన ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం చేసిన 58 రోజుల ఆమరణ నిరాహార దీక్షకు గుర్తుగా 58 అడుగుల ఎత్తులో “త్యాగ విగ్రహం”గా ఈ కాంస్య విగ్రహాన్ని రూపొందించారు. ఈ ప్రాజెక్టుకు గత ఏడాది సెప్టెంబర్ 3న మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. అనంతరం యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టి కేవలం ఆరు నెలల వ్యవధిలో విగ్రహ నిర్మాణాన్ని పూర్తి చేయడం విశేషంగా భావిస్తున్నారు. మార్చి 16న జరిగే ఈ విగ్రహావిష్కరణ మహోత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి . చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథులుగా హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.
తుళ్ళూరు–పెడపరిమి రహదారిపై ఉన్న శాఖమూరు పార్కులో సాయంత్రం 3 గంటలకు కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా రాష్ట్ర నలుమూలల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు, సామాజిక సంస్థల ప్రతినిధులు హాజరయ్యే అవకాశముందని నిర్వాహకులు తెలిపారు. పొట్టి శ్రీరాములు త్యాగాన్ని తరతరాలకు గుర్తు చేసేలా అమరావతిలో ఈ భారీ విగ్రహాన్ని నిర్మించడం చారిత్రాత్మక ఘట్టమని ట్రస్ట్ ప్రతినిధులు పేర్కొన్నారు.
