ఎంఎస్‌ఎంఈల్లో గ్రీన్ ఇన్వెస్ట్‌మెంట్‌కు కేంద్రం ప్రోత్సాహం ..

ఎంఎస్‌ఎంఈల్లో గ్రీన్ ఇన్వెస్ట్‌మెంట్‌కు కేంద్రం ప్రోత్సాహం ..
పర్యావరణహిత సాంకేతికతల విస్తరణే లక్ష్యం
ఎంఎస్‌ఈ, గిఫ్ట్ పథకంతో దేశవ్యాప్తంగా 5,096 యూనిట్లకు లబ్ధి
ఎంపీ కేసినేని చిన్ని ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం
విజయవాడ, ఆంధ్రప్రభ : సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) రంగంలో పర్యావరణహిత పెట్టుబడులను ప్రోత్సహించడం కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన, ఎంఎస్‌ఎంఈ శాఖల సహాయ మంత్రి శోభా కరండ్లజే తెలిపారు. లోక్‌సభలో కేశినేని శివనాథ్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి ఎంఎస్‌ఎంఈ రంగంలో గ్రీన్ ఇన్వెస్ట్‌మెంట్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించారు.
చిన్న పరిశ్రమల్లో పర్యావరణానికి అనుకూలమైన సాంకేతికతలను ప్రోత్సహించేందుకు కేంద్రం ప్రత్యేక పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. ఈ క్రమంలో అమలు చేస్తున్న ఎంఎస్‌ఈ–గ్రీన్ ఇన్వెస్ట్‌మెంట్, ఫైనాన్స్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ పథకం ద్వారా గ్రీన్ టెక్నాలజీ వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ పథకానికి మొత్తం రూ.353 కోట్ల నిధులు కేటాయించగా ఇప్పటివరకు రూ.14.47 కోట్లు వినియోగించబడినట్లు తెలిపారు. ఈ పథకంలో ప్రధానంగా ఇంటరెస్ట్ సబ్వెన్షన్ కాంపోనెంట్‌కు రూ.350 కోట్లు కేటాయించగా ఇప్పటివరకు రూ.13.22 కోట్లు ఖర్చు అయ్యాయని మంత్రి పేర్కొన్నారు.
ఇక సమాచార, అవగాహన కార్యక్రమాల కోసం రూ.3 కోట్లు కేటాయించగా రూ.1.25 కోట్లు వినియోగించబడినట్లు వివరించారు. దేశవ్యాప్తంగా ఈ పథకం ద్వారా మొత్తం 5,800 యూనిట్లకు లబ్ధి చేకూర్చడం లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటివరకు 5,096 సూక్ష్మ, చిన్న పరిశ్రమలు ప్రయోజనం పొందినట్లు తెలిపారు. రాష్ట్రాల వారీగా చూస్తే తమిళనాడు 1,067 యూనిట్లతో ముందంజలో ఉండగా, పంజాబ్‌లో 610, రాజస్థాన్‌లో 608, మహారాష్ట్రలో 578, హర్యానాలో 529 యూనిట్లు లబ్ధి పొందినట్లు తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 128 పరిశ్రమ యూనిట్లు ప్రయోజనం పొందినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
ఇందులో 2023–24లో 20, 2024–25లో 46, 2025–26లో 62 యూనిట్లు లబ్ధి పొందినట్లు వివరించింది. ఈ పథకం గురించి పరిశ్రమలకు అవగాహన కల్పించేందుకు స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంకు అఫ్ ఇండియా ద్వారా దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
ఇప్పటివరకు 60 అవగాహన కార్యక్రమాలు, వర్క్‌షాప్‌లు, వెబినార్‌లు నిర్వహించి పరిశ్రమల ప్రతినిధులకు పథకం ప్రయోజనాలను వివరించినట్లు వెల్లడించారు. పర్యావరణహిత సాంకేతికతలను పరిశ్రమల్లో ప్రవేశపెట్టడం ద్వారా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంతో పాటు కాలుష్యాన్ని తగ్గించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.
