నల్గొండ: పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజ్ పై పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. ఈనెల 21న నకిరేకల్ గురుకుల పాఠశాలలో తెలుగు ప్రశ్నపత్రం లీకైంది. పరీక్ష మొదలైన కాసేపటికే సోషల్ మీడియాలో తెలుగు ప్రశ్నపత్రం చక్కర్లు కొట్టింది. ఈ ఘటనపై నల్గొండ జిల్లా పోలీసులు, విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టారు. ఇద్దరు అధికారులను విధుల నుంచి తొలగించారు. పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ గోపాలు, డిపార్ట్ మెంటల్ అధికారి రామ్మోహన్ రెడ్డిని విధుల నుంచి తొలగించారు. పరీక్ష కేంద్రం ఇన్విజిలేటర్ గా ఉన్న టీజీటీ సుధారాణిని సస్పెండ్ చేశారు.
ఇప్పటికే ప్రశ్నపత్రం లీక్ కేసులో ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. నిందితుల్లో ఓ బాలుడు, జిరాక్స్ కేంద్రం నిర్వాహకుడు ఉన్నారు. పరీక్ష జరుగుతున్న గది వద్దకు బాలుడు గోడ దూకి వచ్చినట్లు సమాచారం. విద్యార్థిని పరీక్ష రాస్తుండగా కిటికీలో నుంచి ప్రశ్నపత్రం ఫొటో తీసినట్లు తెలిసింది. ఈ ప్రశ్నపత్రం కాపీని ఆ బాలుడు జిరాక్స్ కేంద్రంలో ఇచ్చినట్లు సమాచారం. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుల నుంచి 5 సెల్ ఫోన్లు, జిరాక్స్ యంత్రం, కంప్యూటర్ స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు తన ప్రమేయం లేకపోయినా డిబార్ చేశారని బాధిత విద్యార్థిని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు పరీక్షలు రాసే అవకాశం ఇవ్వాలని కోరారు. బాధిత విద్యార్థిని, అతని తండ్రిని పోలీసులు విచారించి పంపారు.