Insurance Fraud | కాసుల కోసం కపట ప్రేమ…

Insurance Fraud | కాసుల కోసం కపట ప్రేమ…

Insurance Fraud | రూ.2 కోట్ల బీమా కోసం అనాథ యువకుడిపై హత్యాయత్నం
స్నేహం పేరుతో పథకం… ఇన్సూరెన్స్ సొమ్మే లక్ష్యం
సారపాకలో రోడ్డుప్రమాదంగా చూపించే ప్రయత్నం
గాయాలతో బతికిన యువకుడు… పోలీసులకు అనుమానం
బూర్గంపాడు ఎస్ఐ దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన అసలు నిజం

ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : డబ్బుకోసం ఎంతకైనా తెగిస్తున్నారు. తన, మన అనే బేధం లేకుండా అనుకున్నదే తడువుగా పథకం ప్రకారం దారుణాలకు పాల్పడుతున్నారు. కష్టపడకుండా డబ్బు సంపాదించి… లైఫ్ ను ఎంజాయ్ చేయాలని చూస్తున్నారు. అలాంటి ఘటనే ఒకటి తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. అనాథ అయిన ఒక యువకుడిపై రూ.2కోట్ల బీమా చేయించి, ఆ డబ్బును జీవితాన్ని ఎంజాయ్ చేయాలని.. అతడిని హతమార్చేందుకు పథకం పన్నారు ఇద్దరు వ్యక్తులు. అయితే ఆ ప్రయత్నం వికటించి జైలుపాలయ్యారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..​. జిల్లాలోని సారపాక గ్రామంలో దారుణమైన హత్యకు యత్నించిన ఓ ఘటన కలకలం రేపింది. గతంలో ఐటీసీ పీఎస్పీడీలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేసిన యశ్వంత్ అనాథ. తన జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అయితే అదే గ్రామానికి చెందిన కట్టా సాయిదీపక్ గత ఆరు నెలలుగా యశ్వంత్ తో స్నేహం పెంచుకున్నాడు. అతనికి అన్ని విధాలా ఆర్థిక సాయం చేస్తున్నట్లు.. అండగా ఉంటున్నట్లు నటించాడు. ఈ ఇద్దరికి తోడు ప్రైవేట్ బ్యాంక్ ఇన్సూరెన్స్ సేల్స్ ఆఫీసర్ కొండ భానుప్రకాశ్ కూడా తోడయ్యాడు. అయితే ఈ క్రమంలోనే ఆర్థిక ఇబ్బందులు పడుతున్న సాయిదీపక్, ఇన్సూరెన్స్ రంగం గురించి తెలిసిన భానుప్రకాశ్ కలిసి యశ్వంత్ ను చంపి.. తద్వారా వచ్చే బీమా సొమ్ముతో ఆర్థికంగా సెటిల్ కావొచ్చని అనుకున్నారు.

కులాలు వేరైనా యశ్వంత్, సాయిదీపక్ ఇంటిపేరు (కట్టా) ఒకటే కావడం ఒక ట్విస్ట్. అది కూడా వారికి కలిసివచ్చినట్లు అయ్యింది. ముందుగా వేసుకున్నపథకం ప్రకారం నాలుగు నెలల క్రితం యశ్వంత్ పేరిట రెండు కోట్ల రూపాయలకు నిందితులు బీమా చేయించారు. అందులో భాగంగా యశ్వంత్ కు సాయిదీపక్ సోదరుడు అవుతాడని రికార్డుల్లో చూపిస్తూ నామినీగా చేర్పించారు. అంతా అనుకున్నట్లే జరగడంతో రాత్రి సమయంలో భద్రాచలంలో యశ్వంత్ కు ఒక స్కూటీ ఇప్పించి, మద్యం కొనిచ్చి సారపాక సమీపంలోని మోతె పట్టీనగర్ కు రమ్మని చెప్పారు. అనుకున్నవిధంగా సాయిదీపక్, భానుప్రకాశ్ కారులో ముందుగానే అక్కడికి చేరుకున్నారు.

యశ్వంత్ వచ్చిన తర్వాత సమ్మక్క-సారలమ్మ గద్దెల వద్ద అతనికి మద్యం తాగించి.. ఒక్కసారిగా అతడి తలపై బలమైన వస్తువుతో కొట్టారు. దెబ్బలకు యశ్వంత్ స్పృహ తప్పి పడిపోవడంతో.. చనిపోయాడుకుని అతడిని రోడ్డుపై పడేసి.. స్కూటీని దూరంగా పడేశారు. రోడ్డు ప్రమాదంగా కనిపించేలా చేయాలనుకున్నారు. రక్తం మడుగులో పడి ఉన్న యశ్వంత్ ను స్థానికులు చూసి పోలీసులకు సమాచారమిచ్చారు.

ఈ లోపు నిందితులు అక్కడకు చేరుకొని గాయపడింది తమ వాడే అని చెప్పి.. అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు.​ యశ్వంత్ ను భద్రాచలం నుంచి ముందు గుంటూరుకు, ఆ తర్వాత అక్కడి నుంచి మళ్లీ తిరిగి ఖమ్మంకు తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉండడంతో అనుమానం వచ్చిన పోలీసులు విచారించగా… అసలు విషయం వెలుగుచూసింది. బూర్గంపాడు ఎస్ఐ మేడా ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply