ముంపు ప్రాంతాల పరిశీలన
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : మొంథా తుఫాన్ కారణంగా జిల్లా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని యాదాద్రి భువనగిరి జిల్లా(Yadadri Bhuvanagiri District) కలెక్టర్ హనుమంతరావు సూచించారు. జిల్లాలో ముంపు ప్రాంతాలను జిల్లా కలెక్టర్ ఈ రోజు పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముందస్తుగా చౌటుప్పల్ పట్టణంలోని ఊర చెరువు ఎఫ్ టీ ఎల్ పరిధిలో, చెరువు చుట్టూ ఉన్న లోతట్టు ప్రాంతాలను ఆర్డీఓ వెలమ శేఖర్ రెడ్డి తదితర అధికారులతో కలిసి పరిశీలించారు.
చెరువు నిండిన తర్వాత చుట్టూ పక్క కాలనీల్లో నీళ్లు రాకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మరో రెండు, మూడు రోజులు భారీ వర్షాలు(heavy rains) ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం మొత్తం అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లాలో వర్షాలకు చెరువులు నిండి అలుగును పోస్తుండడం, పలు చోట్ల వాగులు పొంగి ప్రవహించడంతో లోలెవల్ రోడ్లు నీట మునిగిపోయాయన్నారు.
ప్రజలు ఎవ్వరు కూడా వాహనాలతో సాహసాలు చేయవద్దని, వాగులు, వంకలు దాటవద్దని హెచ్చరించారు. ఈ కార్యక్రమాలలో జిల్లా కలెక్టర్ వెంట చౌటుప్పల్ ఆర్డీఓ శేఖర్ రెడ్డి, నీటిపారుదల శాఖ మనోహర్, డి ఈ రాజవర్ధన్ రెడ్డి(D.E. Rajavardhan Reddy), మండల తహసీల్దార్ వీరాబాయి, మున్సిపల్ కమిషనర్ గుత్తా వెంకట్రాంరెడ్డి, ఇన్స్పెక్టర్ మన్మథకుమార్(Inspector Manmatha Kumar), మార్కెట్ వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి, ఆర్ ఐ లు కొప్పుల సుధాకర్ రావు, బాణాల రాంరెడ్డి, సంబంధిత అధికారులు, ఫైర్, రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.

