అత్యాధునిక పద్ధతుల్లో వినూత్న సాగు..

ఆంధ్రప్రభ, కృష్ణాజిల్లా ప్రతినిధి : అది సాగర తీరంలో ఓ కుగ్రామం దివిసీమ ఉప్పెనకు సాక్షీభూతం. ఆనాడు కళేబరాలతో… రాబంధులతో .. దుర్గంధంతో.. అల్లాడిన భావదేవరపల్లి నేటి తరానికి.. అదొక ఆధునిక గ్రామంగా మారింది. అత్యాధునిక పద్దతుల్లో వనామీ రొయ్యల సాగుకు ప్రయోగశాలగా మారింది.

ఈ రొయ్యల సాగు అంటేనే.. అదొక బెట్టింగ్ తో సమానం. కాలం కలిసొస్తే.. ఇంట్లో లక్షల నోట్లు కట్టలుగా మారుతాయి. ఏమాత్రం స్వల్పంగా సాగు వికటించిందో.. ఆసామి కాస్తా బికారి కావాల్సిందే. కానీ ఈ గ్రామంలో ఓ ఆక్వా సంస్థ పనితీరు, నైపుణ్యం ముందు నష్టాలు పారిపోతాయంటే అతిశయోక్తి కాదు.

నిజమా.. ఈ అద్బుతానికి అసలు కారణమేంటీ? తెలుసుకునేందుకు బుధవారం సాయంత్రం కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అవనిగడ్డ నియోజకవర్గ శాసనసభ్యులు మండలి బుద్ద ప్రసాద్ తో కలిసి నాగాయలంక మండలం భావదేవరపల్లి గ్రామ శివారులో ఆధునిక పద్ధతుల్లో సాగు చేస్తున్న వనామీ రొయ్యల చెరువులను క్షేత్రస్థాయిలో సందర్శించి పరిశీలించారు.

సాగర గ్రంధి ఆక్వా ఫార్మ్స్ గత నాలుగేళ్లుగా ఆధునిక పద్ధతులను అవలంబిస్తూ సాధారణ రొయ్యల చెరువుల మాదిరి కాకుండా ప్రత్యేకంగా నిర్మించిన చెరువుల్లో బయోఫ్లాక్ విధానంలో వనామీ రొయ్యలను సాగు చేస్తున్న విధానాన్ని ఆసక్తిగా పరిశీలించారు. సాగుకు పెట్టుబడి ఖర్చులు, రాబడి వివరాలు, ఎగుమతులు, ఇతర సమస్యలను జిల్లా కలెక్టర్ బాలాజీ అడిగి తెలుసుకున్నారు.

సాగర గ్రంధి ఆక్వా ఫార్మ్స్ సంస్థ ప్రతినిది సతీష్ తెలిపిన సాగు విధానం ఇలా ఉంది. మొదటి నెల రోజుల్లోపు వరకు రొయ్య పిల్లను ప్రత్యేకంగా నిర్మించిన సిమెంటు ట్యాంకుల్లో పెంచుతారు. దీంతో 90 శాతం వరకు రొయ్య పిల్ల చనిపోవు. మంచి నాణ్యతగా ఎదుగుతాయి.

అవసరమైన ఆక్సిజన్ ను ప్రత్యేక పైపులు (బ్లోయర్స్) ద్వారా నేరుగా ట్యాంకులోకి అందిస్తారు, మేత కూడా అలాగే అందిస్తారు, ట్యాంకులోని వ్యర్ధాలను ప్రత్యేక పైపులతో బయటకు పంపిస్తారు. ఈ నెల రోజుల్లోపు ఎదిగిన రొయ్య పిల్లను మరో ట్యాంకుల్లోకి తరలిస్తారు. అక్కడ మరో 60 రోజుల వరకు ఇదే రీతిలో ఆక్సిజన్, మేత అందిస్తారు.

అనంతరం రొయ్యల పట్టుబడి చేపడుతారు. మొదటి నెల రోజుల్లోపు రొయ్య పిల్లను ప్రత్యేకంగా పెంచడంతో నీరు, వాతావరణ కాలుష్యం నుంచి రక్షణ పొంది రొయ్య పిల్ల మనుగడ రేటు (సర్వైవల్ రేట్) 90 శాతానికి పైగా ఉంటుంది. మంచి దిగుబడులను లభించే అవకాశం ఉంది.

ఈ సాగు విధానం ఎంత మేర విజయవంతం అయ్యిందనే విషయాన్ని పరిశీలించి జిల్లాలోని ఇతర ప్రాంతాలలో సైతం అవలంబించే విధంగా చర్యలు తీసుకోవాలని మత్స్య శాఖ అధికారులకు కలెక్టర్ బాలాజీ ఈ సందర్భంగా సూచించారు. ఈ పర్యటనలో జిల్లా మత్స్య శాఖ అధికారి నాగరాజా, నాగాయలంక మండల తహసిల్దార్ వీరాంజనేయ ప్రసాద్, యువ నాయకులు మండలి వెంకట్రామ్ పాల్గొన్నారు.

Leave a Reply