TG | బీసీ జాతికి కాంగ్రెస్ తోనే అన్యాయం… గంగుల కమలాకర్
హైదరాబాద్, ఆంధ్రప్రభ : బీసీ జాతికి కాంగ్రెస్ తీరని అన్యాయం చేసిందని మండి పడ్డారు బీఆర్ఎస్ నేత, మాజీమంత్రి గంగుల కమలాకర్. వాస్తవాలను దాచిపెట్టి కావాలనే బీసీ జనాభాను తగ్గించేశారంటూ ఆరోపించారు. తెలంగాణ భవన్ లో మండలి విపక్ష నేత మధుసూదనచారితో కలసి నేడ మీడియా మాట్లాడుతూ… కాంగ్రెస్ మొదటి నుంచి బీసీల వ్యతిరేకి అని, అసెంబ్లీలో పెట్టిన కులగణన రిపోర్టు ఓ బోగస్ అని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్పులతో బీసీ జాతికి అన్యాయం జరిగిందన్నారు.
నిన్నటి సభలో రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి బీసీల లెక్కలపై మమ్మల్ని బుల్డోజ్ చేసే ప్రయత్నం చేశారని, బుల్డోజ్ చేస్తే భయపడటానికి మేము గొర్రెలమా అని మండిపడ్డారు. అలాగే పదేళ్లకు జనాభా పెరుగుదల 13శాతం ఉంటుందని, ఆ ప్రకారం 4 కోట్ల 25 లక్షల జనాభా ఉంటుందని, కానీ 3 కోట్ల 75 లక్షల జనాభాకు కులగణన పరిమితం చేసిందని చెప్పారు. దాదాపు 50లక్షల బీసీ జనాభాను మింగేశారని, ముస్లింలు కలపకుండానే బీసీల జనాభా 56శాతం పైనే ఉంటుందని, కానీ కేవలం 46శాతం చూపారని తెలిపారు. అన్ని కులాల శాతం పెరిగి, బీసీల జనాభా కావాలనే పది శాతం తగ్గించారని, పాలకులకు బీసీలంటే భయమని ఆరోపించారు.
మిగతా కాంగ్రెస్ ప్రభుత్వాలు బీసీలను తొక్కేసినట్టే రేవంత్ సర్కారు తొక్కేస్తోందన్నారు. రీ సర్వే చేయాలని, మళ్ళీ సర్వే చేస్తే బీసీల జనాభా 56శాతం వస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి దమ్ముంటే కులాల వారీగా జనాభా ఎంతో బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఇక నిన్న అసెంబ్లీలో బీసీల మీద చాలా ప్రేమ ఉన్నట్లు మాట్లాడారని, తనను పేరు పెట్టి పిలిచి మరి మాట్లాడారని తెలిపారు. నిజంగా మీకు బీసీల మీద ప్రేమ ఉంటే, సర్వేలో బీసీలను 46శాతం నుంచి 56శాతానికి పెంచితే రేవంత్ రెడ్డి తామే శాలువా కప్పి సత్కరిస్తామని గంగుల చెప్పారు.