ఎంసీహెచ్ ఆస్పత్రిలో ఘటన
వైద్యుల నిర్లక్ష్యమంటూ కుటుంబం ఆందోళన
తాండూరు, ఆంధ్రప్రభ : ప్రసవం తర్వాత బిడ్డకు ప్రాణం పోసిన ఓ బాలింత కొద్ది సేపటికే కన్నుమూసింది. ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ కుటుంబీకులు ఆందోళనకు దిగారు. ఈ సంఘటన తాండూరు (Tandur) పట్టణంలోని మాతా శిశు ఆసుపత్రిలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
వికారాబాద్ జిల్లా (Vikarabad District) కోట్ పల్లి మండలం ఎన్నారం గ్రామానికి చెందిన రజిత రెండవ కాన్పు కోసం కోసం తాండూరులోని మాత శిశు ఆసుపత్రిలో చేరింది. కుటుంబ సభ్యులకి కూడా ఉన్నారు. ఆదివారం రెండవ కాన్పులో పాపకు జన్మనిచ్చింది. ప్రసవం తర్వాత రాత్రి రజితకు ఫిడ్స్ రావడంతో మృతి చెందినట్లు వైద్యులు కుటుంబీకులకు తెలిపారు. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆరోగ్యంగా ఉన్న రజిత ఎలా చనిపోతుందంటూ వైద్యులను నిలదీశారు. చికిత్సలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే రజిత మృతి చెందిందని ఆందోళనకు దిగారు. నిర్లక్ష్యం వహించిన వైద్యులపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

