వైభవంగా షష్ఠి వేడుకలు..

వైభవంగా షష్ఠి వేడుకలు..

  • ఘనంగా సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం

ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడ లోని ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఫాల్గుణ శుద్ధ షష్ఠి సందర్భంగా సోమవారం విశేష కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. షష్ఠి తిథిని పురస్కరించుకుని మహా మండపంలోని 7వ అంతస్తులో గల కళావేదిక వద్ద వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి లోకక్షేమార్థం క్రతువులను పూర్తి చేశారు.

ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ) పాల్గొని పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. భక్తుల సౌకర్యార్థం మహా మండపంలో విస్తృత ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. కళ్యాణ మహోత్సవాన్ని దర్శించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామి కృపను పొందారు.

Leave a Reply