Indrakeeladri | ఇంద్రకీలాద్రిపై కొత్త పార్కింగ్ నిబంధనలు…

Indrakeeladri | ఇంద్రకీలాద్రిపై కొత్త పార్కింగ్ నిబంధనలు…

రద్దీ రోజుల్లో వాహనాలపై ఆంక్షలు..
వీఐపీలకు పరిమిత అనుమతులు
ఓం టర్నింగ్ వద్ద సామాన్య వాహనాల నిలిపివేత
ఉచిత బ్యాటరీ వాహనాల ద్వారా
ఘాట్ రోడ్డుపై సింగిల్ రో విధానంలోనే అనుమతి
పోలీసు పర్యవేక్షణలో కఠిన అమలు

Indrakeeladri | ఆంధ్రప్రభ, ఇంద్రకీలాద్రి : విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ ఆలయానికి భక్తుల రద్దీ అధికమవుతున్న నేపథ్యంలో వాహన రాకపోకలను నియంత్రించేందుకు కొత్త పార్కింగ్ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. శుక్ర, శని, ఆదివారాలు పండుగ రోజుల్లో ఈ నిబంధనలు కఠినంగా అమలు చేయనున్నారు. భక్తులకు సౌకర్యం కల్పించడంతో పాటు భద్రత, రద్దీ నియంత్రణ ప్రధాన లక్ష్యాలుగా అధికారులు స్పష్టం చేశారు.

Indrakeeladri | వాహనాలపై పరిమిత ఆంక్షలు..

అమ్మవారి దర్శనానికి వచ్చే వీఐపీలైన న్యాయమూర్తులు, మంత్రులు, క్యాబినెట్ హోదా కలిగిన వారి వాహనాలకు మాత్రమే డోనర్ సెల్ వరకు అనుమతి ఉంటుంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వంటి ఇతర వీఐపీల వాహనాలు రిసెప్షన్ ప్రాంతంలోనే నిలిపివేయాల్సి ఉంటుంది. ఇతర రిఫరల్ వాహనాలన్నీ తప్పనిసరిగా ఓం టర్నింగ్ వద్దే పార్క్ చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి.

వృద్ధులు, దివ్యాంగులు, వీఐపీలు, ప్రత్యేక అవసరాలున్న భక్తుల కోసం ఓం టర్నింగ్ నుంచి ఆలయానికి ఉచిత బ్యాటరీ వాహనాల సేవ అందుబాటులో ఉంచారు. ఇది భక్తులు సులభంగా కొండపైకి చేరుకునేలా చేయడంలో కీలకంగా మారనుంది.

Indrakeeladri | రద్దీ రోజుల్లో కఠినంగా అమలు..

కనకదుర్గమ్మ దర్శనానికి పండుగలు, వారాంతాల్లో రద్దీ అధికంగా ఉండటంతో కొండపైకి వెళ్లే ఘాట్ రోడ్డుపై కేవలం ఒకే వరుస వాహనాలకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. దీనివల్ల ట్రాఫిక్ రద్దీ తగ్గడంతో పాటు ప్రమాదాల నివారణకు దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు. అమ్మవారి ఆలయ శాశ్వత అర్చకులు స్థానిక ప్రెస్ ప్రతినిధులకు ద్విచక్ర వాహనాలను ఘాట్ రోడ్డుపై సింగిల్ రోలో పార్క్ చేసుకునే అనుమతి కల్పించారు.

ఇతర సిబ్బంది, సెక్యూరిటీ, కాంట్రాక్టర్ల వాహనాలు మాత్రం తప్పనిసరిగా ఓం టర్నింగ్ వద్దే నిలిపివేయాల్సి ఉంటుంది. ఈ నిబంధనల అమలును పోలీసు యంత్రాంగం, ఆలయ భద్రతా సిబ్బంది సంయుక్తంగా పర్యవేక్షించనున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. రద్దీ రోజుల్లో వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించి, అధికారులు ఏర్పాటు చేసిన పార్కింగ్ కేంద్రాలు, బ్యాటరీ వాహనాల సేవలను వినియోగించుకోవాలని భక్తులకు సూచించారు.

Leave a Reply