ఆసియా కప్‌లో యూఏఈతో ఢీ..

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : టీమిండియా (Team India) ఇప్పుడు ఆసియా కప్ (Asia Cup)పై కన్నేసింది. నేడు (బుధవారం) యూఏఈతో టీమిండియా తమ తొలి పోరాటానికి సిద్ధమైంది. ఈ మ్యాచ్ కేవలం ఒక టోర్నమెంట్ ఆరంభం మాత్రమే కాదు. అక్టోబర్ 14న దాయాది జట్టు పాకిస్థాన్ ( Pakistan)తో జరిగే కీలక మ్యాచ్‌కు ముందు ‘డ్రెస్ రిహార్సల్’గా పరిగణించబడుతోంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ ( Dubai International Cricket) స్టేడియంలో రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్ మొదలవుతుంది. ఇప్పటికే 8సార్లు విజేతగా నిలిచిన భారత్ ఈసారి కూడా ఫేవరెట్‌గానే పోటీపడుతోంది.
తుది జట్టు కూర్పుపై ఆసక్తి…
అయితే, భారత తుది జట్టు కూర్పు ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది. ప్రధాన కోచ్‌గా గంభీర్ (Gambhir as head coach) పగ్గాలు చేపట్టినప్పటి నుంచి జట్టులో ఆల్‌రౌండర్ల ప్రాధాన్యత ఎక్కువగా కనిపిస్తోంది. పేస్, స్పిన్ ఆల్రౌండర్లను బరిలోకి దించేందుకు అతను ఇష్టపడుతున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీ్‌సలోనూ ఇదే సూత్రాన్ని అనుసరించి సుందర్‌కు అవకాశమిచ్చాడు. ఎనిమిదో నెంబర్ వరకు బ్యాటింగ్‌లో ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని గంభీర్ భావిస్తుంటాడు. ఇప్పుడు ఆల్‌రౌండర్ విభాగంలో హార్దిక్ పాండ్యా(Hardik Pandya), అక్షర్ పటేల్‌లకు జతగా శివమ్ దూబేను కూడా ఆడించే ఆలోచనలో ఉన్నాడు. దూబే స్పిన్నర్లను దీటుగా ఎదుర్కొని వేగంగా పరుగులు సాధించగలడు. అప్పుడు కుల్దీప్ యాదవ్ బెంచ్‌కే పరిమితం కాక తప్పదు. స్పిన్‌లో వరుణ్ చక్రవర్తి, అక్షర్‌కు తోడు అభిషేక్‌తో ఓవర్లు వేయించే అవకాశం ఉంది. ఇక కీపర్‌గా సంజూ శాంసన్‌ను పక్కనబెట్టి జితేశ్ శర్మను ఆడించడం ఖాయమే. నెట్ సెషన్స్‌లోనూ జితేశ్ ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం దీనికి ఊతమిస్తోంది. గిల్ జట్టులో చేరడంతో ఓపెనర్‌గా శాంసన్ స్థానం గల్లంతైంది. అతడిని మూడో నెంబర్లో ఆడించాలని చూసినా అక్కడ తిలక్ వర్మ నిలకడగా రాణిస్తున్నాడు. జితేశ్‌ను ఏడు, అక్షర్‌ను ఎనిమిదో స్థానంలో బరిలోకి దించవచ్చు. మిడిలార్డర్లో తిలక్, కెప్టెన్ సూర్య, హార్దిక్ కీలకం కానున్నారు. బౌలింగ్‌లో బుమ్రా, అర్ష్‌దీప్ ప్రధాన పేసర్లుగా ఉంటారు.
పేసర్లకు అనుకూలంగా..
గత మార్చిలో భారత్ ఇక్కడ చాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy) ఆడిన సమయంలో నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. కానీ ప్రస్తుతం దుబాయ్ ట్రాక్ పచ్చికతో కనిపిస్తోంది. దీంతో పేసర్లకు అనుకూలించే అవకాశం ఉంది.
తుది జట్లు (అంచనా)
భారత్: గిల్, అభిషేక్, తిలక్, సూర్యకుమార్ (కెప్టెన్), జితేశ్, హార్దిక్, శివమ్ దూబే, అక్షర్, బుమ్రా, అర్ష్‌దీప్, వరుణ్.
యూఏఈ: వసీమ్ (కెప్టెన్), షరాఫు, రాహుల్, ఆసిఫ్, ఫరూఖ్, హర్షిత్, సిమ్రన్‌జీత్, జవదుల్లా, హైదర్, సిద్దిఖీ, రోహిద్.
