స్విస్ ఓపెన్‌లో భారత స్టార్ మహిళల డబుల్స్ ప్లేయర్లు గాయత్రి గోపీచంద్-ట్రిసా జాటీ జోడీ క్వార్టర్ ఫైనల్స్‌లో దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల డబుల్స్ ప్రి-క్వార్టర్స్‌లో నాలుగో సీడ్ గాయత్రి-ట్రిసా జోడీ 21-12, 21-8 తేడాతో అమెలీ లెహ్‌మన్-సెలిన్ హుబ్సచ్ (జర్మనీ) జంటను వరస గేముల్లో చిత్తు చేశారు.
సింధు ఔట్…
మరోవైపు మహిళల సింగిల్స్ మాత్రం భారత్‌కు భారీ షాక్ తగిలింది. రెండుసార్లు ఒలింపిక్ పతక బ్యాట్మింటన్ స్టార్ పివి.సింధు మరోసారి నిరాశపరిచింది. స్విస్ ఓపెన్‌లో ఆరంభ మ్యాచ్ లోనే ఇంటిబాట పట్టింది.
స్విస్ ఓపెన్ సూపర్ 300లో తొలి రౌండ్‌లో డెన్మార్క్‌కు చెందిన జూలీ జాకబ్‌సెన్ తో తలపడిన సింధు.. 17-21, 19-21 తేడాతో ఓటమిపాలైంది. ఈ ఓటమి ఈ ఏడాది సింధు వరుసగా మూడోసారి తొలి రౌండ్‌లోనే నిష్క్రమించడం గమనార్హం.
మరో మ్యాచ్ లో నాలుగో సీడ్ కుసుమ వర్దాని (ఇండోనేషియా) చేతిలో అనుపమా ఉపాద్యాయ, ఖియాన్ జి హాన్ (చైనా) చేతిలో ఇషారాణి ఓటమిపాలై టోర్నీ నుంచి వైదొలిగారు.
పురుషుల సింగిల్స్‌లోనూ.. ప్రియాంషు రజావత్, శంకర్ ముత్తుస్వామి, కితాంబి శ్రీకాంత్ కూడా ఓటములతో రెండో రౌండ్‌లోనే ఇంటిబాట పట్టారు.