IND vs SL-W | మూడో మ్యాచే ముగింపవ్వాలి..

- కథ క్లోజ్ చేయడమే టార్గెట్ !!
ఆంధ్రప్రభ : భారత పర్యటనలో ఉన్న శ్రీలంక మహిళల క్రికెట్ జట్టుతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తోంది. ఇప్పటికే విశాఖపట్నం వేదికగా ముగిసిన మొదటి రెండు మ్యాచ్‌లలో ఘనవిజయాలు సాధించిన భారత మహిళలు, 2-0 ఆధిక్యంతో సిరీస్‌లో పటిష్ట స్థితిలో ఉన్నారు.
ఇక నేడు (శుక్రవారం) కేరళలోని తిరువనంతపురం వేదికగా జరగనున్న మూడవ టీ20లో కూడా గెలిచి, మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకోవాలని హర్మన్‌ప్రీత్ సేన పట్టుదలతో ఉంది. గత 11 మ్యాచ్‌లలో 9 సార్లు శ్రీలంకపై విజయం సాధించిన రికార్డు భారత్‌కు ఎక్స్‌ట్రా కాన్ఫిడెన్స్ ఇస్తోంది.
టీమిండియా జోరు..
భారత జట్టు అన్ని విభాగాల్లోనూ స్ట్రాంగ్ అండ్ బాలెన్స్డ్ గా కనిపిస్తోంది. మొదటి మ్యాచ్‌లో జెమీమా రోడ్రిగ్స్ వీరోచిత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోగా, రెండవ మ్యాచ్‌లో ఓపెనర్ షఫాలీ వర్మ తనదైన శైలిలో విరుచుకుపడి జట్టుకు విజయాన్ని అందించింది. భారత్ తరఫున అత్యధిక ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు అందుకున్న మూడో క్రీడాకారిణిగా షఫాలీ వర్మ నిలిచింది. స్మృతి మంధాన, షఫాలీ వర్మల జోడీ టీ20 చరిత్రలోనే అత్యంత విజయవంతమైన భాగస్వామ్యంగా (2,918 పరుగులు) కొనసాగుతోంది.
ఇక, బౌలింగ్ విభాగంలోనూ యువ రక్తం ఉరకలేస్తోంది. ఆంధ్ర అమ్మాయి ఎన్.శ్రీచరణి, వైష్ణవి శర్మ, క్రాంతి గౌడ్ వంటి యువ ప్లేయర్లు క్రమశిక్షణతో బౌలింగ్ చేస్తూ సీనియర్ల పనిభారాన్ని పంచుకుంటున్నారు. స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ అనారోగ్యం కారణంగా దూరమైనప్పటికీ, ఆమె స్థానంలో వచ్చిన స్నేహ రాణా (4 ఓవర్లలో 11 పరుగులకు 1 వికెట్) అద్భుతంగా రాణించి భారత బెంచ్ బలాన్ని నిరూపించింది. తొలి మ్యాచ్‌లో ఐదు క్యాచ్‌లు జారవిడిచిన ఫీల్డింగ్ లోపాలను సరిదిద్దుకుని, రెండో మ్యాచ్‌లో పదునైన రనౌట్లతో జట్టు ఫీల్డింగ్ ప్రమాణాలను పెంచుకుంది.
శ్రీలంక కష్టాలు: కుప్పకూలుతున్న బ్యాటింగ్ లైనప్
మరోవైపు, వరుస పరాజయాలతో సతమతమవుతున్న శ్రీలంక జట్టు తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తోంది. శ్రీలంక జట్టు బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ విఫలమవుతోంది. ఆ జట్టును ప్రధానంగా బ్యాటింగ్ వైఫల్యాలు వేధిస్తున్నాయి. రెండు మ్యాచ్‌లలోనూ 130 పరుగుల లోపే పరిమితం అయ్యింది శ్రీలంక జట్టు. విష్మి గుణరత్నే వంటి ప్లేయర్లు ఆరంభంలో మెరిసినా, హాసిని పెరీరా, హర్షిత వంటి సీనియర్లు మందకొడి బ్యాటింగ్‌తో జట్టును ఇబ్బందుల్లోకి నెడుతున్నారు.
రెండో మ్యాచ్‌లో కేవలం 26 పరుగుల వ్యవధిలోనే ఆరు వికెట్లు కోల్పోయి పేకమేడలా కుప్పకూలడం శ్రీలంక ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. డ్యూ (మంచు) ప్రభావం వల్ల లంక బౌలర్లు కూడా బంతిపై పట్టు సాధించలేకపోతున్నారు. భారత పటిష్ట బ్యాటింగ్ లైనప్‌ను అడ్డుకోగల సత్తా శ్రీలంక బౌలర్లలో కనిపించడం లేదు.
జట్టులో పలు మార్పులు చేసి యువకులకు ఛాన్స్ ఇస్తున్నప్పటికీ, వారు ఈ అవకాశాలను అందిపుచ్చుకోవడంలో తడబడుతున్నారు. అయితే, ప్రపంచకప్‌కు ముందు తమ ఉనికిని చాటుకోవాలంటే శ్రీలంక జట్టు ఈ మ్యాచ్‌లో అసాధారణ ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. అందుకే నేటి మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేస్తే 150కి పైగా పరుగులు చేసి భారత్‌కు సవాల్ విసరాలని కెప్టెన్ చమరి ఆటపట్టు భావిస్తోంది.
పిచ్, వాతావరణ పరిస్థితులు
తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం మొదటిసారి మహిళల అంతర్జాతీయ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తోంది. గతంలో ఇక్కడ జరిగిన పురుషుల మ్యాచ్‌లలో రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్లకు కలిసివచ్చినప్పటికీ, చివరి మ్యాచ్‌లో భారత్ మొదట బ్యాటింగ్ చేసి భారీ స్కోరు సాధించింది.
శుక్రవారం సాయంత్రం ఆకాశం మేఘావృతమై ఉండే అవకాశం ఉన్నప్పటికీ, వర్షం పడే సూచనలు తక్కువగానే ఉన్నాయి. మొమెంటం పూర్తిగా భారత్ వైపు ఉన్న నేపథ్యంలో, ఈ వేదికపై కూడా గెలిచి సిరీస్‌ను 3-0తో ముగించాలని హర్మన్‌ప్రీత్ కౌర్ సేన పట్టుదలతో ఉంది.
తుది జట్ల అంచనా
భారత్: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, దీప్తి శర్మ/స్నేహ రాణా, జెమీమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ, హర్లీన్ డియోల్, అరుంధతి రెడ్డి, అమన్‌జ్యోత్ కౌర్, క్రాంతి గౌడ్, రేణుకా సింగ్, రిచా ఘోష్ (కీపర్), శ్రీచరణి, వైష్ణవి శర్మ.
శ్రీలంక: చమరి ఆటపట్టు (కెప్టెన్), హాసిని పెరీరా, విష్మి గుణరత్నే, హర్షిత సమరవిక్రమ, నీలక్షిక డిసిల్వా, కవిషా దిల్హరి, ఇమేషా దులాని, కౌషిని న్యుత్యాంగన, మల్షా షెహానీ, ఇనోకా రణవీర, శశిని గివ్హాని, కవూయ మదుష్కాని.
నేటి మ్యాచ్ ద్వారా భారత్ సిరీస్ క్లీన్ స్వీప్ దిశగా అడుగులు వేస్తుందో లేక శ్రీలంక పోరాడి సిరీస్‌లో నిలుస్తుందో చూడాలి.
