ఓవల్ : ఇంగ్లండ్ – భారత్ మధ్య జరుగుతున్న ఐదో టెస్టులో నాలుగో రోజు ఆట వర్షంతో ఆగిపోయింది. నాలుగో రోజు ఆరంభం టీమిండియాకు అనుకూలంగా సాగింది. బెన్ డకెట్, ఒల్లీ పోప్ లను తొందరగా పెవిలియన్‌కి పంపిన భారత బౌలర్లు, ఇంగ్లండ్‌ను 106/3 వద్ద ఆపారు. కానీ అప్పుడే రంగంలోకి దిగిన జో రూట్ – హ్యారీ బ్రూక్ లు భారత బౌలింగ్‌పై విరుచుకుపడ్డారు. హ్యారీ బ్రూక్ (111), జో రూట్ (105) శతకాలు నమోదు చేసి.. నాలుగో వికెట్‌కు 195 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు.
వీరిద్దరిని ఔట్ చేసిన తర్వాత జాకబ్ బెటెల్ కేవలం 5 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో స్మిత్ (2), ఓవర్టన్ (0) ఉన్నారు. అయితే ఆపై వర్షం కారణంగా ఆట నిలిచిపోయి, నాల్గో రోజు స్టంప్స్ ప్రకటించారు. అయితే, ఇంగ్లండ్ విజయానికి కేవలం 35 పరుగులు మాత్రమే అవసరం కాగా, భారత్ ఇంకా నాలుగు వికెట్లు తీయాల్సిన అవసరం ఉంది. నాల్గవ రోజు మ్యాచ్ హోరాహోరీగా సాగగా, సిరీస్ ఫలితాన్ని నిర్ణయించే ఐదవ రోజు ఉత్కంఠభరితంగా మారింది.
ఇది సిరీస్‌లో చివరి మ్యాచ్ – ఐదవ రోజు ఏదైనా జరగవచ్చు. ఈ ఉత్కంఠభరితమైన చివరి టెస్ట్ క్రికెట్ అభిమానులకు ఒక క్లాసిక్ ఎపిసోడ్ కానుంది.
నాలుగో టెస్ట్ స్కోర్ కార్డ్
IND తొలి ఇన్నింగ్స్ 224-10(69.4)
ENG తొలి ఇన్నింగ్స్ 247-10(51.2)
IND రెండో ఇన్నింగ్స్ 396-10(88.0)
ENG రెండో ఇన్నింగ్స్ 339-6(76.2)
ENG గెలవడానికి ఇంకా 35 పరుగులు అవసరం
IND గెలవడానికి ఇంకా 4 వికెట్లు అవసరం