Srisailam | కృష్ణమ్మ పరవళ్లు.. శ్రీశైలం జలాశయం కు పెరిగిన వరద !

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువన ఉన్న జలాశయాల నుంచి భారీగా వరద విడుదల చేస్తున్న నేపథ్యంలో మరో మూడు నాలుగు రోజుల్లో శ్రీశైలం జలాశయం నిండుతుందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి.

జూరాల, సుంకేశుల బ్యారేజ్‌ల నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోకి 1,38,841 క్యూసెక్కులు చేరుతుండగా.. విద్యుదుత్పత్తి ద్వారా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు 67,488 క్యూసెక్కులను దిగువన సాగర్‌కు విడుదల చేస్తున్నారు.

శ్రీశైలం నుంచి పోతి రెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ ద్వారా 20వేల క్యూసెక్కులు, హంద్రీ నీవా కోసం 1,013 క్యూసెక్కులను ఏపీ తీసుకుంటుండగా, కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 1,600 క్యూసెక్కులను తెలంగాణ తీసుకుంటోంది.

మహారాష్ట్ర, కర్ణాటకల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కృష్ణా ప్రధాన పాయతోపాటు మలప్రభ, ఘటప్రభలు వరద పోటు త్తుతున్నాయి. దాంతో ఆల్మట్టి, నారాయణపూర్‌ డ్యామ్‌లలోకి వరద ఉధృతి పెరిగింది.

ఆల్మట్టి డ్యామ్‌లోకి 94వేల క్యూసెక్కులు చేరుతుండగా.. 90 వేల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. నారాయణపూర్‌ డ్యామ్‌లోకి 1.15 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 1.01 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు.

జూరాల ప్రాజెక్టులోకి 1.15 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 1.22 లక్షల క్యూసెక్కులను దిగు వకు వదిలేస్తున్నారు. తుంగభద్ర డ్యామ్‌కి వస్తున్న 39,339 క్యూసెక్కుల వరదను వచ్చిందొచ్చినట్టుగా దిగువన శ్రీశైలంకు విడుదల చేస్తున్నారు.

శ్రీశైల జలాశయం ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు అధికారులు తెలిపిన లెక్కల వివరాల ప్రకారం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం జలాశయంలో 882.70 అడుగులు ఉన్నాయి. జలాశయంలో నీటి సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుతం జలాశయంలో నీటి సామర్థ్యం 202.9673 టీఎంసీలుగా నమోదయి ఉంది.

విద్యుత్ ఉత్పత్తికి కుడి ఎడమల నుంచి 67,488 క్యూసెక్కుల నీటిని సాగరకు విడుదల చేస్తున్నారు. ఏపీ జల విద్యుత్ కోసం32,173 క్యూసెక్కుల నీటిని వాడుతుండగా, తెలంగాణ ప్రాంతం నుంచి35,315 క్యూసెక్కుల నీటిని జల విద్యుత్ కోసం వినియోగిస్తున్నారు.

Leave a Reply