దొంగతనం కేసులో ఇద్దరికి జైలు శిక్ష

దొంగతనం కేసులో ఇద్దరికి జైలు శిక్ష

రూ.25 లక్షల చోరీ.. రెండు సంవత్సరాల శిక్ష విధించిన డోన్ కోర్టు

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : రూ.25 లక్షల దొంగతనం కేసులో ఇద్దరు ముద్దాయిలకు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ డోన్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎస్. జ్యోతి తీర్పు వెలువరించారు. పోలీసుల వివరాల ప్రకారం, తెలంగాణ రాష్ట్రం సికింద్రాబాద్‌లో నివాసం ఉంటున్న రాజస్థాన్ రాష్ట్రం సిరోయ్ జిల్లా నాగని గ్రామానికి చెందిన ప్రవీణ్ ఆర్. రావాల్ (52) ఇచ్చిన ఫిర్యాదు మేరకు కర్నూలు జిల్లా కృష్ణగిరి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. 2025 అక్టోబర్ 25న హైదరాబాద్ నుంచి బెంగుళూరు వెళ్తున్న బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో రూ.25 లక్షలు దొంగిలించబడినట్లు ఫిర్యాదు అందింది. ఈ ఘటన అమకతాడు టోల్ ప్లాజా వద్ద గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.


కేసు దర్యాప్తు చేపట్టిన వెల్దుర్తి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ బి. మధుసూదన్ రావు 2025 అక్టోబర్ 27న కర్నూలు టౌన్ పరిధిలోని కల్లూరు మండలం దిన్నెదేవరపాడు గ్రామం సమీపంలో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బిజ్నోర్ జిల్లాకు చెందిన మహమ్మద్ షహీద్ (35), సుహేబ్ (20)గా గుర్తించారు. అనంతరం వారిని కోర్టులో హాజరు పరచగా రిమాండ్‌కు తరలించారు. కేసు విచారణ అనంతరం డోన్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు ఇద్దరు ముద్దాయిలకు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది.


ఈ కేసులో సమర్థంగా వాదనలు వినిపించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ భాస్కర్ రావును, కేసు దర్యాప్తులో కీలక పాత్ర పోషించిన పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అభినందించారు.

Leave a Reply