హైదరాబాద్ : ఎస్సీ వర్గీకరణ అమలు చేయడమే అంబేద్కర్ కు ఘన నివాళి అని సీఎం రేవంత్ అన్నారు. భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ వద్ద ఆ మహనీయుని విగ్రహానికి సీఎం రేవంత్ రెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వెంట ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, పలువురు నేతలు పాల్గొని బాబాసాహెబ్ సామాజిక సమానత్వ సందేశాన్ని స్మరించుకుంటూ శ్రద్ధాంజలి ఘటించారు.
అలాగే అంబేద్కర్ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ… అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రజా ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు. ఎస్సీ వర్గీకరణతో 3 దశాబ్దాల పోరాట ఆకాంక్షలు నెరవేర్చడమన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లతో నాణ్యమైన విద్య అందుతుందన్నారు. రైతుకు, రైతు కూలీలకు ఎకరాకు రూ.12 వేల ఆర్థిక భరోసా సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్ల పథకం, భూ భారతికి శ్రీకారం చుట్టడం ఆ మహనీయుడికి ఘన నివాళి అని ఎక్స్‌లో సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.