Illegal construction’s | అక్రమ నిర్మాణాలు మిగిలిన వాటి పరిస్థితేంటి..

Illegal construction’s | అక్రమ నిర్మాణాలు మిగిలిన వాటి పరిస్థితేంటి..
- కొండను పిండిచేస్తున్న రియల్ మాఫియా
- పత్తాలేని మైనింగ్ అధికారులు
- మామూళ్ల మత్తులో టౌన్‌ప్లానింగ్ అధికారులు
- శేరిలింగంపల్లి సర్కిల్‌లో వెలుగుచూస్తున్న ఆక్రమాలు
ఆంధ్రప్రభ నిఘా విభాగం, గ్రేటర్ హైదరాబాద్ : అక్రమ నిర్మాణాలపై అధికారులు చర్యలు తీసుకోవడంలో విఫలం అవుతున్నారా.. నిర్మాణ దారులకు భయం లేకుండాపోయిందా.. శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలో ఇష్టారాజ్యంగా పుట్టుకొస్తున్న అక్రమ నిర్మాణాలను చూస్తున్న ప్రతిఒక్కరి మదిలో ఉన్న ప్రశ్న ఇది… వంద గజాల్లోపు స్థలాల నుంచి మూడు వందల గజాల స్థలాలైనా ఎటువంటి అనుమతులు లేకుండా.. తీసుకున్న అనుమతులకు వ్యతిరేకంగా ఇష్టారా జ్యంగా బహుళ అంతస్థుల నిర్మాణా లు చేపడుతున్నారు.
ఇంత జరుగుతు న్నా అధికారులు అటు-వైపు కన్నెత్తి చూడక పోవడంతో నిబంధనలను బేఖాతర్ చేస్తున్న నిర్మాణాల సంఖ్య వందల్లో ఉంటుంది. సర్కిల్ 18, 20 పరిధిలోని జూబ్లీహిల్స్, శేరిలింగంపల్లి సరిహద్దు వివాదాల వల్ల రియల్ మాఫియా పేట్రేగి పోయింది.
ప్రశాసన్‌నగర్‌లోని రోడ్డు నెంబర్- 70తో పాటు లింక్‌రోడ్ పరిసర ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాల జాతరను తమదికాదన్నట్లు రెండు సర్కిళ్ల అధికారులు చూసిచూడనట్లు వదిలేశారు. ఆంధ్రప్రభ వరుస కథనాలు ప్రచురించడంతో జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆదేశాలతో శేరిలింగంపల్లి టౌన్‌ప్లానింగ్ అధికారులు స్పందించి తమ పరిధేనంటూ రెండు బహుళ అంతస్థుల నిర్మాణాలను సీజ్‌చేశారు.
దీంతో ఆంధ్రప్రభ కథనాలకు స్థానికులు జేజేలు పలికారు. మరోవైపు రోడ్డు నెంబర్-70 ప్రశాసన్ నగర్‌లో పదుల సంఖ్యలో కొనసాగుతున్న అక్రమ నిర్మాణాల్లో ఒకటో, రెండో అక్రమ నిర్మాణాలను సీజింగ్ అంటూ రిబ్బన్‌లు కడుతూ చేతులు దులుపుకున్నారు. మిగిలిన అక్రమ నిర్మాణాలను ఎందుకు సీజ్‌చేయలేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. తాత్కాలికంగా కట్టిన సీజింగ్ రిబ్బన్‌లను తొలిగించి తిరిగి అక్రమనిర్మాణ పనులను కొనసాగించేలా అక్రమ నిర్మాణ దారులకు సహకరిస్తూ మామూళ్ల మత్తులో అధికారులు జోగుతున్నట్లు తెలుస్తోంది..
అవినీతి అధికారులు మారరా… !
ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం అనుమతి లేని నిర్మాణాలు, అనధికార అంతస్తులే లక్ష్యంగా అవినీతి అధికారులు రెచ్చిపోతున్నారు. భవనాలను సీజ్‌చేసే అధికారాన్ని పూర్తిగా దుర్వి నియోగం చేస్తున్నారు. మామూళ్ల కోసం విచ్చ లవిడిగా వాడుకుంటున్నారు. యజమానులు లంచం అందివ్వగానే, సదరు అధికారులు ఆయా భవనాల వైపు కన్నెత్తిచూడట్లేదు. ఏమీ తెలియనట్లు అలాగే ఉండిపోతున్నారు.
అనుమతి లేని భవనాలను, నిర్మాణాలను నియంత్రించేందుకు ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు, రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కొన్ని సూచనలు చేశాయి. ప్రాథమికంగా మొదటి దశలోనే అనుమతి లేని భవనాలను గుర్తించి, అక్కడికక్కడే భవనాన్ని లేదా నిర్మాణ ప్రాంగణాన్ని సీజ్‌చేయాలని ఆదేశించాయి. జీహెచ్‌ఎంసీ చట్టం-1955లోని సెక్షన్ 461-ఏ క్రింద భవనాలను సీజ్‌చేసే అధికారాన్ని జీహెచ్‌ఎంసీ సర్కిళ్ల ఉప కమిషనర్, జోనల్ కమిషనర్లకు కేటాయిస్తూ కమిషనర్ ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. సీజ్‌చేసిన భవనాన్ని, తిరిగి నిర్మించాలంటే న్యాయస్థానాల నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది.
శేరిలింగంపల్లి జోన్లోనే ఎక్కువ …
ఇప్పటివరకు సుమారు గ్రేటర్ పరిధిలో ఏకంగా 300 భవనాలను జీహెచ్‌ఎంసీ సీజ్ చేసింది. శేరిలింగంపల్లి జోన్‌లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాల మాటున రూ.కోట్లలో లంచాలు వసూలు చేసి ప్రధాన రహదారులపైనా అక్రమ నిర్మాణాలను ఇష్టారితీన అనుమతిస్తున్నారు. అనుమతులకు మించి 3 నుండి 5 అదనపు అంతస్థులతో యథేచ్ఛగా కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలను తొలగించడంలో సర్కిల్ 20 టౌన్ ప్లానింగ్ అధికారుల వైఫల్యం, అవినీతి, ఆక్రమణలపై కఠినంగా వ్యవహరిస్తారని చెప్పుకుంటున్న సర్కిల్ 20 పరిధిలో కళ్లముందే కొనసాగుతున్న బహుళ అంతస్థుల అక్రమ నిర్మాణాలపై చర్యలను కఠినంగా చేపట్టడంలో మౌనం వహించడం వెనుక మతలబు ఏమిటో పెరుమాళ్ళకే ఎరుక… సర్కిల్‌లో ఎన్నో ఏండ్లుగా పాతుకుపోయి ఉన్న టౌన్‌ప్లానింగ్ విభాగం అధికారులు అక్రమ నిర్మాణాల వెనుక అండగా ఉంటూ ప్రభుత్వం కండ్లు కప్పి నిర్మాణాలు చేపడుతున్న వారికి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తున్నట్టు సమాచారం.
నిబంధనలకు విరుధ్ధంగా బాంబ్ బ్లాస్టింగ్‌లు…
సర్కిల్ 20 పరిధిలోని ప్రశాసన్‌నగర్‌లో కొంతమంది తమ ఇష్టానుసారంగా, నిబంధన లకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు అంతటా వినబడుతున్నాయి. నిర్మాణంలో భాగంగా రాత్రి సమయాల్లో తరు చూ బాంబ్ బ్లాస్టింగ్ శబ్ధాలు వస్తూనే ఉన్నాయని, దీంతో చుట్టూ రేకులు ఏర్పాటు చేసి పనులు కొనసాగిస్తున్నారని ఒకవేళ రాళ్లు ఎగిసిపడి తమ ఇండ్ల మీద పడితే పరిస్థితి ఏంటని అధికారులను ప్రశ్నిస్తున్నారు.
సెల్లార్ తవ్వకాలలో పెద్ద బం డరాళ్లు అడ్డురావడంతో పేలుళ్లు జరుపుతున్నా రని, దీంతో నిద్రహారాలు లేకుండా గడుపుతున్నా మని, అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించు కోవడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా నిర్మాణ ప నుల కారణంగా శబ్దకాలుష్యం, దుమ్మూ ధూళి, రాత్రులు సైతం నిద్రలేకుండా అర చేతిలో ప్రాణాలను బిగపట్టుకొని ఉంటున్నామని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని పాదాచారులు, వాహన దారులు, స్థానిక ప్రజలు కోరుతున్నారు.
