అక్రమ ఇసుక రవాణాపై గుడిపాల పోలీసుల కఠిన చర్యలు

అక్రమ ఇసుక రవాణాపై గుడిపాల పోలీసుల కఠిన చర్యలు

రెండు ఇసుక లారీల స్వాధీనం

గుడిపాల, ఆంధ్రప్రభ : చిత్తూరు జిల్లా పరిధిలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో గుడిపాల పోలీసుల తనిఖీల్లో రెండు ఇసుక లారీలు స్వాధీనం చేసుకుని ఒకరిని అరెస్ట్ చేశారు. చిత్తూరు జిల్లా ఇంచార్జ్ ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు ఆదేశాల మేరకు, అడిషనల్ ఎస్పీ ఎస్.ఆర్. రాజశేఖర్ రాజు పర్యవేక్షణలో గుడిపాల ఎస్‌.ఐ. రామ్మోహన్ ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. శుక్రవారం అర్ధరాత్రి సమయం, సుమారు రాత్రి 11 గంటల ప్రాంతంలో చిత్తూరు వైపు నుంచి తమిళనాడుకు ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక లారీలు అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారం పోలీసులకు అందింది.


ఈ సమాచారంతో గుడిపాల పోలీసులు నరహరిపేట చెక్‌పోస్ట్ వద్ద వాహనాలను తనిఖీ చేశారు. ఈ సమయంలో చిత్తూరు వైపు నుంచి వచ్చిన రెండు ఇసుక లారీలు పోలీసులను గమనించాయి. వాహనాలను ఆపగా ఒక లారీ డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. మరో లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసుల విచారణలో అతని పేరు షణ్ముఘం అని వెల్లడైంది. పూతలపట్టు ప్రాంతంలో ఇసుక లోడ్ చేసి తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై, సేలం, వేలూరు తదితర ప్రాంతాలకు అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నట్లు అతను ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఘటనపై పట్టుబడిన డ్రైవర్ షణ్ముఘం, పారిపోయిన మరో లారీ డ్రైవర్, అలాగే రెండు లారీల యజమానులపై గుడిపాల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు ఎస్‌.ఐ. రామ్మోహన్ తెలిపారు. స్వాధీనం చేసుకున్న రెండు లారీలను పోలీసులు పోలీస్ స్టేషన్‌కు తరలించి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. జిల్లాలో అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు పోలీసులు కఠిన చర్యలు కొనసాగిస్తారని అధికారులు హెచ్చరించారు. ఎవరు అక్రమంగా ఇసుక రవాణా చేసినా కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.

Leave a Reply