కదిలిస్తే కఠిన చర్యలే!!

కదిలిస్తే కఠిన చర్యలే!!
జన్నారం, ఆంధ్రప్రభ : అడవుల్లోని విలువైన టేకు చెట్లను నరికి అక్రమంగా కలప రవాణా చేసే స్మగ్లర్లపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు స్థానిక ఎఫ్డీఓ ఎం.రామ్మోహన్ అన్నారు. మంచిర్యాల జిల్లా(Manchryala District) జన్నారం అటవీ డివిజనల్ లోని కవ్వాల టైగర్ రిజర్వు, ఇందనపల్లి రేంజ్ కామనపల్లి గ్రామ సమీపాన కెనాల్ వద్ద ఈ రోజు అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫారెస్టు చెక్పోస్టును ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కవ్వాల అడవుల నుంచి అక్రమంగా టేకు, కలప(teak, timber)ను తరలిస్తున్నారనే ఉద్దేశంతో చెక్కుపోస్టును ఏర్పాటు చేశామన్నారు. ఈ చెక్కు పోస్టు వల్ల నిరంతరం అటవీ అధికారులు విధుల్లో ఉండి పర్యవేక్షిస్తారన్నారు. అడవులతో పాటు వన్యప్రాణులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. ఇకనుంచి కలప స్మగ్లర్లపై, వన్యప్రాణుల వేటగాళ్లపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచి, ఫారెస్ట్, వన్యప్రాణుల యాక్టు ప్రకారం కఠిన చర్యలు తీసుకోనున్నట్లు సూచించారు.
ఈ కార్యక్రమంలో ఇందనపల్లి, జన్నారం ఇన్చార్జి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు జి. లక్ష్మీనారాయణ, పీ.మమత, ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్, సెక్షన్, బీట్ ఆఫీసర్లు విజయ్ కుమార్, రవికుమార్, హన్మంతరావు, మక్బూల్, రుబీన, పోచయ్య తదితరులు పాల్గొన్నారు.
