సింగరేణి సంస్థకు భవిత
మంచిర్యాల, ఆంధ్రప్రభ ప్రతినిధి : కార్మికులను కాపాడుకుంటే సింగరేణి సంస్థకు భవిష్యత్తు ఉంటుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ( Kavitha) అన్నారు. బతుకమ్మ వేడుకల్లో భాగంగా మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ కు వచ్చిన ఆమె ఈ రోజు మీడియాతో మాట్లాడారు. లాభాల బాటలో నడిచే ఈ సింగరేణి సంస్థను నేడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రభుత్వం దివాలా దశకు తీసుకువచ్చిందని మండిపడ్డారు. 42 వేల కోట్ల అప్పు తీసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, వాటిని తిరిగి చెల్లించకుండా సింగరేణిని బిచ్చం ఎత్తుకుని అడుక్కునే విధంగా ఎల్ఐసికి వెళ్లి మూడు వేల కోట్లు అప్పు తీసుకొమ్మని సూచించడం విచారకరమని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి అధికారులు ముందుగా అవినీతిని తగ్గించుకుంటేనే కొత్త బావులు ఉద్యోగాలు దొరికే అవకాశాలు ఉన్నాయని కవిత వెల్లడించారు. సింగరేణి (Singareni) లాభాల వాటా గురించి ఆమె మాట్లాడుతూ సంస్థ సాధించిన నికర లాభాల్లో వాటా ఇవ్వకుండా.. అభివృద్ధి పేరిట వేల కోట్ల నిధులు మినహాయించి అంకెల గారడీ చేసి 30శాతం లాభాలను మాత్రమే కార్మికులకు పంచడం పట్ల ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇక పెద్దపెల్లి మంచిర్యాల జిల్లాలను ఆమె ప్రస్తావిస్తూ ఇది కాంగ్రెస్ రాజ్యమా.. పోలీసు రాజ్యమా..? అని కవిత ప్రశ్నించారు. దౌర్జన్యాలు ఇలాగే కొనసాగితే ఎల్లకాలం కార్మికులు ఊరుకోబోరని ఆమె స్పష్టం చేశారు.


