నవీన్ ని గెలిపిస్తే.. మరింత అభివృద్ది చేస్తాం..
హైదరాబాద్, (ఆంధ్రప్రభ) : జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఎర్రగడ్డ డివిజన్ లోని బ్రిగేడ్ సిటాడెల్ అపార్ట్మెంట్ లో వాకర్స్ మీట్ నిర్వహించారు. స్పోర్ట్స్ లాంజ్ లో అపార్ట్మెంట్ వాసులతో కలిసి షటిల్, టేబుల్ టెన్నిస్ ఆడారు. జిమ్ లో కాసేపు ఉత్సాహంగా గడిపారు మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally KrishnaRao). అనంతరం వారితో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రజా ప్రభుత్వం ఈ రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు. ఆరు గ్యారంటీల అమలులో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500 కే గ్యాస్ సిలిండర్, ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం తదితర పథకాల్ని లబ్ధిదారులకు అందిస్తున్నామని చెప్పారు. ఫ్యూచర్ సిటీ, హైదరాబాద్ విస్తరణ, అభివృద్ధి పనుల గురించి వివరించారు. చేతి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్అభ్యర్థి నవీన్ యాదవ్ ను ఆశీర్వదించాలని అభ్యర్థించారు.

మీరంతా ఉన్నత విద్యావంతులు, ఉద్యోగులు, వ్యాపారవేత్తలు.. మీ అందరి సహకారంతో కాంగ్రెస్ అభ్యర్థి (Congress candidate) భారీ మెజారిటీతో గెలిపిస్తే, ఈ ప్రాంతాన్ని మరింత ఆధునికంగా తీర్చిదిద్దుతాం. రోడ్లు, డ్రైనేజీ, పార్కులు, సీసీ కెమెరాలు, వైఫై జోన్లు అన్నీ అందుబాటులోకి తెస్తాం అని మంత్రి జూపల్లి కృష్ణారావు హామీ ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రి కెసీఆర్ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని, ఇష్టారీతిన వ్యవహరించి రూ. 8 లక్షల కోట్ల అప్పులు చేశారని, వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితిని వివరించారు. అయినప్పటి అభివృద్ధి, సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని వెల్లడించారు.
జూబ్లీహిల్స్ (JubileeHills) ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని, ప్రజలు మరోసారి పార్టీకి అవకాశం ఇస్తారని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అపార్ట్‌మెంట్ అసోసియేషన్ అధ్యక్షులు, సభ్యులు మంత్రిని సత్కరించారు. కొందరు తమ సమస్యలను నేరుగా మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. వీటిని త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి, కూడా చైర్మన్ వెంకట్రామ్ రెడ్డి, స్థానిక నేతలు పాల్గొన్నారు.

