ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : తెలంగాణ (Telangana) రాష్ట్రంలో కొన్ని రోజులుగా కుండపోత వానలు కురుస్తున్నాయి. ఇవాళ ( సోమవారం ) పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ (Department of Meteorology) వెల్లడించింది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు, నల్లగొండ, రంగారెడ్డి, సూర్యాపేట, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే బయటకు వెళ్లాలని సూచించింది.

రాబోయే మూడు రోజుల పాటు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అలాగే హైదరాబాద్ (Hyderabad)లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్, పెద్ద అంబర్‌పేట, నాగోల్, మన్సూరాబాద్, రామోజీ ఫిల్మ్‌సిటీ పరిసర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రహదారులు, కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. చిన్నపాటి వర్షానికే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఇళ్లలోకి నీరు చేరుతుంది. హైదరాబాద్-విజయవాడ నేషనల్ హైవే (National Highway)పై పలు చోట్ల వర్షపు నీరు చేరడంతో వాహనాల రాకపోకలు నెమ్మదిగా సాగాయి.

