ఐదు ఎకరాల భూమి స్వాధీనం

ఐదు ఎకరాల భూమి స్వాధీనం
హైదరాబాద్, ఆంధ్రప్రభ : హైదరాబాద్‌లో ప్రభుత్వ ఆస్తులు, చెరువుల పరిరక్షణ లక్ష్యంగా ఏర్పాటు చేసిన హైడ్రా (HYDRA) తన దూకుడును పెంచింది. హైలెవ్ ఆక్రమణలపై కూడా దృష్టి సారించింది. ఈ రోజు బంజారా హిల్స్‌లో ఆక్రమణలను హైడ్రా తొలగించింది. ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది. ఈ భుమి విలువ రూ.750 కోట్లు అని అన్నారు. రెండు రోజుల కిందట కొండాపూర్‌లో సర్వే నెంబర్ 59లో ఉన్న సుమారు 36 ఎకరాల భూమిలోని నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. సుమారు రూ.3,600 కోట్ల విలువైన ఈ భూములను స్వాధీనం చేసుకున్న సంగతి విదితమే.
బంజారాహిల్స్ (Banjara Hills) రోడ్డు నంబర్ 10లో ఆక్రమణలను ఈ రోజు హైడ్రా తొలగించింది. గతంలో ప్రభుత్వం ఐదు ఎకరాల్లో 1.2 ఎకరాలను జలమండలికి కేటాయించింది. ఈ క్రమంలో 1.2 ఎకరాలతో పాటు మొత్తం ఐదు ఎకరాల భూమి తనదంటూ పార్థసారథి అనే వ్యక్తి కోర్టుకెక్కాడు. అలాగే చుట్టూ పెన్సింగ్ వేసి బౌన్సర్లతోపాటు వేటకుక్కలతో కాపలా పెట్టాడు. కోర్టులో వివాదం ఉండగా మొత్తం భూమిని తన ఆధీనంలోకి తీసుకొని అందులో షెడ్డు నిర్మించాడు. ప్రభుత్వ భూమిని అడ్డాగా చేసుకుని భయబ్రాంతులకు గురి చేస్తున్నట్లు జలమండలి, రెవెన్యూ అధికారులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు.
ఇక్కడ వాటర్ రిజర్వాయర్ నిర్మించాలనే జలమండలి (jalamandali) ప్రయత్నాలను ఆయన అడ్డుకున్నాడు. ఈ మేరకు ఆయనపై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా భారీ స్థాయిలో ఆక్రమణల కూల్చివేత చర్యలు చేపట్టారు. బసవతారకం ఆసుపత్రి సమీపంలోని జలమండలానికి చెందిన భూమిపై అక్రమ నిర్మాణాలపై స్థానికులు ఫిర్యాదు చేయడంతో హైడ్రా బృందం రంగంలోకి దిగింది. భారీ పోలీసు బందోబస్తు మధ్య జేసీబీలను వినియోగించి ఆక్రమణలను తొలగించారు. ప్రభుత్వ భూములపై ఏ విధమైన అక్రమాలు సహించబోవని అధికారులు హెచ్చరించారు.
