భారీ బందోబస్తు
ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో, ఆంధ్రప్రభ : ఎన్నికల నిబంధనలు పకడ్బందీగా అమలు చేస్తామని జిల్లా ఎస్పీ డి.జానకీ(SP D. Janaki) తెలిపారు. గురువారం నుంచి జిల్లాలోని 16 మండలాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ(MPTC, ZPTC) నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైందని చెప్పారు. నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని, ప్రతి కేంద్రం వద్ద ఎస్సై, సీఐ, డీఎస్పీ లు పర్యవేక్షణ చేస్తారని చెప్పారు. పోలింగ్ కేంద్రాల వద్ద 100 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు.
బారికేడ్లు(Barricades) ఏర్పాటు చేసి, అభ్యర్థులు, అనుమతి పొందిన సహాయకులు మాత్రమే ప్రవేశం కలిగి ఉంటారని చెప్పారు. ఎన్నికల సమయంలో అక్రమ మద్యం విక్రయాలు, రవాణా జరగకుండా ప్రత్యేక పర్యవేక్షణ ఏర్పాటు చేశామని, హోటల్స్(Hotels), డాబాల్లో మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
గత ఎన్నికలలో గందరగోళం సృష్టించిన, క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ కలిగిన వ్యక్తులపై బైండ్‌ఓవర్ చర్యలు తీసుకుంటున్నామని ఎస్‌పీ తెలిపారు. జిల్లాలో ఉన్నఅన్నీ లైసెన్స్(License) ఆయుధాలు తాత్కాలికంగా స్వాధీనం చేసుకున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా రౌండ్ ది క్లాక్(Round the Clock) పెట్రోలింగ్ కొనసాగుతుందని, ప్రతి మండలంలో నిఘా బృందాలు ఏర్పాటు చేశామని చెప్పారు.
అనుమానాస్పద కదలికలు గమనించినవారు వెంటనే డయల్ 100 లేదా పోలీస్ కంట్రోల్(Police Control) రూం 8712659360 కి సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై తప్పుడు సమాచారం, రెచ్చగొట్టే పోస్టులు, ఇతరుల మనోభావాలను దెబ్బతీసే వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌లు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.