నకిలీ మద్యాన్ని విక్రయిస్తే ఉపేక్షించం
బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ రాజు
బాపట్ల టౌన్ అక్టోబర్ 25 ఆంధ్రప్రభ : ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్‌తో నకిలీ మద్యం కట్టడి చేయొచ్చని బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ రాజు తెలిపారు. నకిలీ మద్యాన్ని విక్రయిస్తే ఉపేక్షించమని హెచ్చరించారు. పట్టణంలోని సూర్యలంక రోడ్డు లోని మిత్ర వైన్స్ వద్ద ఆకస్మిక తనిఖీ నిర్వహించి విక్రయిస్తున్న మధ్యాన్ని స్వయంగా పరిశీలించారు. కల్తీ మద్యాన్ని అరికట్టడానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన ఎక్సైజ్ సురక్ష యాప్ వినియోగం గురించి ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు బాపట్ల ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ అధికారులతో కలసి మద్యం ప్రియులకు అవగాహన కల్పించారు. ఏపీ సురక్ష యాప్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నరేంద్ర వర్మ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రత్యేక మద్యం విధానం తీసుకువచ్చి నాణ్యమైన మద్యాన్ని అందుబాటులోకి తెచ్చిందన్నారు. గత ప్రభుత్వం జే బ్రాండ్స్ మద్యం పాలసీతో ఇష్టానుసారంగా నాసిరకం మద్యం అమ్మకాలు చేసి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడిందన్నారు. సురక్ష యాప్ వినియోగంపై ప్రతీ గ్రామంలోను అవగాహన కల్పించాలని కోరారు. యాప్‌తో మద్యం ఎక్కడ, ఎప్పుడు, ఏ కంపెనీ లో తయారయ్యిందో, రేటు కూడా తెలుసుకోవచ్చన్నారు. నకిలీ మద్యం తయారీ కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుందని ఎమ్మెల్యే తెలిపారు. ఇంచార్జ్ జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారి బి వెంకటేశ్వర్లు, సీఐ పాలపర్తి గీతిక, బాపట్ల ఎక్సైజ్ శాఖ పాల్గొన్నారు.

