తుఫాన్ నష్టం ఎంత..?
ఖమ్మం బ్యూరో, (ఆంధ్రప్రభ)
నిర్ణీత నమూనాలో తుఫాన్ నష్టం అంచనా నివేదిక సమర్పించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ ఆదేశించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డితో కలిసి మొంథా తుఫాన్ నష్టం అంచనా వేశారు. ఈ నివేదికలు తయారీకి సంబంధిత అధికారులతో శనివారం సమీక్షించారు.
ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ మాట్లాడుతూ… మొంథా తుఫాన్ కారణంగా ఖమ్మం జిల్లాలో జరిగిన పంట నష్టం వివరాలు నిర్ణీత నమూనాలో నవంబర్ 6 నాటికి అందించాలన్నారు. వ్యవసాయ అధికారులు, ఏ.ఈ.ఓ. క్షేత్ర స్థాయిలో రైతుల పొలాలను సందర్శించి పక్కాగా నివేదిక తయారు చేయాలని, ఏ ఒక్క నష్టపోయిన రైతు మిగలకుండా ప్రతి ఒక్కరిని కవర్ చేయాలని అన్నారు. ఖమ్మం జిల్లాలో పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బి రోడ్లు ఎంత మేరకు మరమ్మత్తులకు గురైందనే అంశాలను క్షేత్ర స్థాయి పరిశీలన చేసి పూర్తి ఆధారాలతో నివేదిక సిద్థం చేయాలన్నారు. తాత్కాలిక మరమ్మత్తులు, శాశ్వత మరమ్మత్తులకు ఎంత వ్యయం అవుతుందో అంచనాలతో సహా వివరాలు సమర్పించాలని తెలిపారు.
విద్యుత్ శాఖ సంబంధించి దెబ్బతిన్న పోల్స్, ట్రాన్స్ ఫార్మర్ వివరాలు అందించాలని అన్నారు. నీటి పారుదల శాఖ పరిధిలో దెబ్బతిన్న చెరువులు, కాల్వలు, నీటివనరుల వివరాలు సమర్పించాలన్నారు. అలాగే ఇతర నిర్మాణాలు, దెబ్బతిన్న ఇండ్ల సంఖ్య, చనిపోయిన పశువులు, గొర్రెలు, పౌల్ట్రీ తదితర వివరాలను పక్కాగా తయారు చేసి నష్టపోయిన ప్రజలకు ప్రభుత్వం అందించే సహాయం చేరేలా చూడాలని అదనపు కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
సమీక్షలో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ… జిల్లాలో తుఫాన్ కారణంగా దెబ్బతిన్న రోడ్లును అందుబాటులో ఉన్న నిధులతో తాత్కాలిక మరమ్మత్తులు చేసేందుకు గల అవకాశాలను పరిశీలించి నివేదిక సమర్పించాలని అన్నారు. ఎస్.డి.ఆర్. ఎఫ్, ఎన్.డి.ఆర్.ఎఫ్. నిధులు ఎంత వరకు అవసరం అవుతాయో పక్కా సమాచారంతో వివరాలు అందించాలని అన్నారు. ఈ సమావేశంలో డిఆర్ఓ ఏ. పద్మశ్రీ, సిపిఓ ఏ. శ్రీనివాస్, ఇర్రిగేషన్, ఆర్ అండ్ బి, పీఆర్ ఎస్ఇ లు ఎం. వెంకటేశ్వర్లు, యాకుబ్, వెంకట్ రెడ్డి, జిల్లా పౌరసరఫరాల అధికారి చందన్ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య, జిల్లా పంచాయతీ అధికారిణి ఆశాలత, జిల్లా మార్కెటింగ్ అధికారి అలీమ్, మార్క్ ఫెడ్ జిల్లా మేనేజర్ సరిత, ఎన్పిడిసిఎల్ డిఇ రామారావు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

