*వైకాపా కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేస్తున్న వైనం
*అయినా వైకాపా వైఫై ప్రజానికం
*రాష్ట్రంలో 57 ఎంపీపీ పదవులకు గాను మెజార్టీ పదవులు వైకాపా కైవసం
*రామగిరి లో మెజార్టీ ఉన్నా వాయిదా వేయించిన వైనం
శ్రీ సత్యసాయి బ్యూరో
ఏప్రిల్ 08 (ఆంధ్రప్రభ):రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విధానం బీహార్ తరహా పాలనను తలపిస్తోందని రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. ముఖ్యంగా రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ వైసిపి నాయకులను, కార్యకర్త లను భయభ్రాంతులకు గురిచేస్తూ వ్యవహరించడం జరుగుతోందన్నారు. ముఖ్యంగా తాను రెడ్ బుక్ ఓపెన్ చేస్తే ఎంతోమందికి ఉచ్చ పడుతుందని బెదిరించడం శోచనీయం అన్నారు. ఇటివల హత్యకు గురైన పాపిరెడ్డిపల్లి కి చెందిన లింగమయ్య కుటుంబ సభ్యులను నేడు జగన్ పరామర్శించారు.. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.. వారికి అన్ని విధాల అండగా ఉంటీామని భరోసా ఇచ్చారు జగన్
ఈ సందర్బంగా పాపిరెడ్డిపల్లిలో జగన్ మీడియాతో మాట్లాడుతూ, ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అనేకమంది ముఖ్య నాయకులను వివిధ కేసుల పేరుతో అరెస్టు చేసి, జైలుకు పంపడం జరిగిందన్నారు. కొంతమంది పైన వరుస కేసులు పడుతూ బెయిల్ కూడా రాకుండా చేయడం జరుగుతోందన్నారు. ఇదంతా కూడా బీహార్ తరహా పాలనను తలపించడం కాక మరొకటి కాదని జగన్మోహన్ రెడ్డి అన్నారు. కాగా ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా ఎంపీపీ పదవులు, ఉప సర్పంచ్ పదవుల విషయంలో 57 పదవుల గాను ఏడు పదవులను ఎన్నికల నిర్వహించకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. 50 పదవులకు ఎన్నికలు జరగగా 39 స్థానాలలో వైకాపా అభ్యర్థులు విజయం సాధించడం జరిగిందన్నారు. దీన్ని బట్టి చూస్తే రాష్ట్ర ప్రజలు వైకాపాకు ఏ స్థాయిలో మద్దతు తెలుపుతున్నారు తెలుసుకోవచ్చన్నారు.
ఇక రామగిరి మండల విషయానికి వస్తే పదిమంది ఎంపీటీసీ సభ్యులకు గాను 9 మంది వైకాపా సభ్యులు ఉండగా కేవలం ఒక సభ్యుడు మాత్రమే టిడిపికి ఉన్న విషయం తెలిసిందే. కానీ ఎన్నికలు నిర్వహించకుండా ఎంపీటీసీ సభ్యులను పోలీసులు తీసుకెళ్లి పెనుకొండ పోలీస్ స్టేషన్లో ఉంచి, ఎక్కడ ఎంఆర్ఓ కు బైండోవర్ చేయడం దేనికని ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా ఎంపీటీసీ సభ్యులను బలవంతంగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్ లతో ఎస్ఐ సుధాకర్ యాదవ్ వాట్సాప్ కాల్ ద్వారా మాట్లాడించడం జరిగిందన్నారు. ఇదే సందర్భంలో ఎంపీటీసీ సభ్యుల కుటుంబ సభ్యులతో సైతం మాట్లాడించారు. కేవలం ఎంపీటీసీ సభ్యులను భయభ్రాంతులకు గురిచేసి టిడిపి వైపు తిప్పుకోవడానికి అలా చేశారని జగన్ ఆరోపించారు. అనంతరం పోలీసుల సమక్షంలో ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు కోర్టు,అధికారులు ఆదేశించినప్పటికీ అందుకు విరుద్ధంగా ఎన్నికకు ఆలస్యంగా తీసుకెళ్లి కోరం లేదని ఎన్నిక వాయిదా వేసిన విషయం తెలిసిందే అన్నారు
ఇదిలా ఉండగా ఉగాది పండుగ సందర్భంగా జరిగిన ఘర్షణ లో టిడిపికి చెందిన నాయకుల చేతిలో దాడికి గురై తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన లింగమయ్య అంత్యక్రియలకు కూడా కార్యకర్తలను ప్రజలను రానివ్వకుండా కేవలం పోలీసులు సమక్షంలోని అంత్యక్రియలు నిర్వహించారు. మృతి చెందిన లింగమయ్య కుటుంబ సభ్యుల తో అదే రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోన్లో మాట్లాడుతూ ధైర్యం చెప్పారు . నేడు స్వయంగా ఆ గ్రామానికి వెళ్లి లింగమయ్య కుటుంబ సభ్యులను జగన్ స్వయంగా పరామర్శించారు.
రామగిరిలో జగన్ కు ఘన స్వాగతం

రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైకాపా అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం ఉదయం సరిగ్గా 11 గంటలకు సికేపల్లి మండలం కుంటిమద్ది గ్రామ వద్ద ఏర్పాటుచేసిన హెలిపాడ్ వద్దకు చేరుకున్నారు. తాడేపల్లి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రావడం జరిగింది. ఈ సందర్భంగా హెలిప్యాడ్ వద్ద వైకాపా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికారు. సీఎం జగన్… సీఎం జగన్, జై జగన్ జై జగన్, వైయస్సార్ అమర్ రహే వైయస్సార్ అమరహే అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సుమారు 15 నిమిషాలకు పైగా అక్కడే హెలిపాడ్ వద్ద ఉండిపోయారు.
అనంతరం అక్కడినుంచి ప్రత్యేక వాహనంలో (ఏసి బస్సులో) పాపిరెడ్డి పల్లెకు బయలుదేరారు. వైయస్ జగన్ వెంట రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఉమ్మడి జిల్లాల వైకాపా అధ్యక్షులు అనంత వెంకట్రామిరెడ్డి, కేవీ ఉషశ్రీ చరణ్, మాజీ ఎంపీలు మాజీ ఎమ్మెల్యేలు పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు ఉన్నారు.
కేతిరెడ్డి హల్చల్

మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి రామగిరి పర్యటన సందర్భంగా మంగళవారం ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి హల్చల్ చేశారు. ఇటీవలనే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి హైదరాబాదులో చార్టెడ్ ఫ్లైట్ నడిపి ఉమ్మడి రాష్ట్రంలోని తెలుగువారి అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్న విషయం తెలిసిందే. తాజాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రామగిరి పర్యటన సందర్భంగా హెలిపాడు వద్ద వైసిపి కార్యకర్తలతో సెల్ఫీలు తీసుకుంటూ హల్చల్ చేశారు. ముఖ్యంగా అక్కడికి వచ్చిన కార్యకర్తలలో ఎక్కువ శాతం మంది కేతిరెడ్డి తో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారని చెప్పవచ్చు