Hospital | ఎందుకు సస్పెండ్ చేశారంటే…

Hospital | ఎందుకు సస్పెండ్ చేశారంటే…
Hospital | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రిలో మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్న ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. దీనిపై మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు ఆందోళనలు చేపట్టడంతో రంగంలోకి దిగిన ప్రభుత్వం పూర్తిస్థాయిలో విచారణ జరిపింది. విచారణ అనంతరం బాధ్యులైన నలుగురిని వైద్యారోగ్య శాఖ కమిషనర్ సస్పెండ్ చేశారు.
జడ్చర్ల ప్రభుత్వాసుపత్రి మార్చురీలో ఓ వ్యక్తి శవాన్ని కుక్క పీక్కుతినడంపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆసుపత్రి సూపరింటెండెంట్ చంద్రకళ, ఆర్‌ఎంవో హరినాథ్, డ్యూటీ డాక్టర్, ఎంఎన్‌వోపై సస్పెన్షన్ వేటు వేసింది. జడ్చర్ల పాత ప్రభుత్వ ఆసుపత్రిని వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్‌కుమార్‌తో పాటు ఉన్నతాధికారులు పరిశీలించారు. ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు.
జడ్చర్ల మండలం నాగసాలకు చెందిన భీమేశ్ (32) ప్రమాదవశాత్తు చెరువులోపడి మృతిచెందాడు. రెండు రోజుల తర్వాత మృతదేహం లభ్యం కావడంతో పోలీసులు జడ్చర్ల ప్రభుత్వ దవాఖాన మార్చురీకి తరలించారు. ఈ విషయం తెలిసి బంధువులు కూడా అక్కడకు చేరుకున్నారు. ఈ క్రమంలో మార్చురీలో కుక్కల శబ్దం రావడంతో దగ్గరికి వెళ్లి చూసిన బంధువులకు ఓ కుక్క మృతదేహాన్ని పీక్కుతినడం కనిపించింది. కుటుంబీకులు ఈ ఘటనను వీడియో తీసి, సిబ్బంది నిర్లక్ష్యంపై మండిపడ్డారు. ఇంత ఘోరమైన పరిస్థితికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విచారణ అనంతరం బాధ్యులైన నలుగురిని వైద్యారోగ్య శాఖ కమిషనర్ సస్పెండ్ చేశారు.
