అత్యంత నాణ్యమైన సౌకర్యాలు..
పారిశుద్ధ్యంపైనా ప్రత్యేకంగా దృష్టిసారించాలి..
జిల్లాలో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ సుడిగాలి పర్యటన..
క్షేత్రస్థాయి అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం..
(ఆంధ్రప్రభ విజయవాడ) : ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ (Collector G.Lakshmisha) సోమవారం జిల్లాలో సుడిగాలి పర్యటన చేశారు. మొంథా తుపాను నేపథ్యంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా క్షేత్రస్థాయిలో చేసిన ఏర్పాట్లను పరిశీలించడంతో పాటు అధికారులు, సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. విజయవాడ అర్బన్ పరిధిలో సున్నపుబట్టీల సెంటర్, గ్రంథాలయ రోడ్డు ప్రాంతంలో ఈ నెల 24న కొండ చరియలు విరిగిపడిన ప్రాంతాన్ని కలెక్టర్ లక్ష్మీశ.. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎంతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ… కొండ ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడే ప్రమాదమున్న ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని.. పరిస్థితిని అంచనా వేసి నివాసితులను పునరావాస శిబిరాలకు తరలించి అవసరమైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ప్రమాదం పొంచి ఉండే ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు (Warning boards) ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనౌన్స్‌మెంట్ల ద్వారా ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. మునిసిపల్, రెవెన్యూ అధికారులు సమన్వయంతో నిరంతర పర్యవేక్షణ పెట్టాలన్నారు.

మొగల్రాజపురం (Mughalrajapuram) బీఎస్ఆర్‌కే మునిసిపల్ ఉన్నతపాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని సందర్శించి.. అక్కడ ఏర్పాటు చేసిన వైద్య శిబిరంతో పాటు బెడ్లు వంటి ఏర్పాట్లను పరిశీలించారు. పునరావాస కేంద్రాల్లో ఆహారం, తాగునీరు, బెడ్డింగ్ మెటీరియల్, పారిశుద్ధ్యం.. ఇలా ప్రతిఒక్కటీ అత్యంత నాణ్యంగా ఉండాలని స్పష్టం చేశారు. పిన్నమనేని పాలీ క్లినిక్ రోడ్డులోని విపత్తు ప్రతిస్పందన పాయింట్‌ను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. నగర పర్యటన అనంతరం వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ వద్ద పరిస్థితిని పరిశీలించారు. ఆ ప్రాంతంలో ప్రత్యేక బృందాలతో నిరంతర పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు.
పంట పొలాల్లో నీరు నిలిచిపోకుండా చూడాలి…
గ్రామీణ ప్రాంతాల్లో పంట పొలాల్లో నీరు నిలిచిపోకుండా చూడాలని.. వర్షపు నీరు ఎప్పటికప్పుడు బయటకు వెళ్లేలా డ్రెయిన్లను సిద్ధంగా ఉంచాలన్నారు. గుర్రపుడెక్క (gurrapu dekka) వంటివి ఉంటే వెంటనే తొలగించేలా చూడాలన్నారు. గ్రామ ప్రజల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. గ్రామ, వార్డు సచివాలయాలల్లో షిఫ్ట్‌ల వారీగా సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు.

