ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : పశ్చిమ-మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం మరింత బలపడుతున్న నేపథ్యంలో తెలంగాణలో వర్షాలు (Rains in Telangana) దంచికొడుతున్నాయి. హైదరాబాద్ (Hyderabad) సహా పలు జిల్లాల్లో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణలో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (Department of Meteorology) హెచ్చరించింది. అప్రమత్తమైన ప్రభుత్వం పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు (Holidays for educational institutions) ప్రకటించగా.. ఐటీ ఉద్యోగులకు (IT employees) వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది. జీహెచ్‌ఎంసీ (GHMC) పరిధిలోని పాఠశాలలకు బుధ, గురువారాల్లో ఒంటిపూట బడులు నిర్వహించాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు బుధవారం మధ్యాహ్నమే విద్యార్థులను బడుల నుంచి ఇంటికి పంపించారు. అలాగే ఐటీ ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసే వెసులుబాటు కల్పించారు.
స్కూళ్లకు ఐదు రోజులు సెలవు
అలాగే వరంగల్, నల్గొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమై, జనజీవనం స్తంభించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో హనుమకొండ, జనగామ, వరంగల్, యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్ జిల్లాల్లో నేడు, రేపు (ఆగస్టు 13, ఆగస్టు 14) ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలన్నింటికీ సెలవులు ప్రకటించారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం (Independence Day), ఆగస్టు 16 శ్రీ కృష్ణ జన్మాష్టమి, ఆగస్టు 17 ఆదివారం కావటంతో ఆ రోజుల్లో కూడా సెలవులు ఉండనున్నాయి. దీంతో ఐదు జిల్లాల్లో వరుసగా ఐదు రోజులు సెలవులు (Five Days Holidays) వచ్చినట్లయింది.
జీహెచ్ఎంసీ అలర్ట్
వాతావరణ శాఖ హైదరాబాద్ నగరానికి రెండు రోజుల పాటు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ.. నగరంలో 269 వాటర్ లాగింగ్ పాయింట్స్ గుర్తించామని తెలిపారు. జలమండలి, వాటర్ బోర్డు, హైడ్రా, ఎలక్ట్రిసిటీ, ట్రాఫిక్ విభాగాలతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు చేపడుతున్నామని ఆయన వెల్లడించారు. నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు.