ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : భాగ్యనగరంలో చినుకు పడితే చాలు జనం వణికి పోవాల్సిన పరిస్థితి నెలకొంది. గ్రేటర్‌లో వాన కష్టాలు వర్ణనాతీతం. హైదరాబాద్(Hyderabad)లో చిన్నపాటి వర్షం(rain) పడినా రోడ్లన్నీ వాగులను తలపిస్తున్నాయి. మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. కుండపోత వానకు పలుచోట్ల మ్యాన్‌హోళ్లు పొంగిపొర్లుతున్నాయి. సాయంత్రమైతే చాలు వరుణుడు పిలిచినట్లు ఉరుముతూ మెరుస్తూ ఉరికి వస్తున్నాడు. తగ్గేదేలే అంటూ గంటల తరబడి వర్షం కురిపించి ప్రజల జీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాడు.
సిటీలో ఫుల్ ట్రాఫిక్ జామ్ (traffic jam) అవుతుండటంతో ప్రజలు నానా యాతన పడుతున్నారు. ఆఫీసు అయిపోయాక ఇంటికి వెళ్లాలంటే గంటల సమయం రోడ్లపైనే గడపాల్సి వస్తోంది. అడుగుతీసి అడుగు వేయలేని పరిస్థితి నెలకొంటుంది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వర్షపు నీరు చేరుతుండటంతో ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు. విద్యుత్ అంతరాయాలతో అంధకారంలో మగ్గుతున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని, ట్రాఫిక్ జామ్ లను నివారించడానికి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని అధికారులు కోరుతున్నారు. కుంభవృష్టి వానలతో ప్రజలు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మేలు.. అవేమిటో ఇప్పుడు చూద్దాం..
తీసుకోవాల్సిన జాగ్రత్తలు…
- వర్షాలు కురుస్తున్న సమయంలో ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మేలు. రోడ్లపై నీరు నిలిచిపోయే అవకాశం ఉన్నందున అవసరమైతే తప్ప బయటకు రాకపోవడం మంచిది.
- ట్రాఫిక్ జామ్ (traffic jam) అవుతున్న కారణంగా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవడం మంచిది.
- వాతావరణ శాఖ(weather department), ఇతర ప్రభుత్వ అధికారుల(government officials) సూచనలను పాటించాలి.
- వాన పడుతున్నప్పుడు రోడ్లపై డ్రైనేజీ హోల్స్ (drainage holes) తెరిచి ఉన్నది కొన్నిసార్లు గుర్తుపట్టలేం. బయట నడుస్తున్నప్పుడు గమనిస్తూ వెళ్లాలి.
- అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు పోలీస్: 100, అగ్నిమాపక దళం (fire brigade): 101 నంబర్లకు డయల్ చేయాలి.
విద్యుత్ ప్రమాదాల బారిన పడకుండా…
- తడి చేతులతో విద్యుత్ బోర్డులో స్విచ్‌లు, ప్లగ్‌లు ఇతర ఉపకరణాలను తాకితే కరెంట్ షాక్ తగిలే ప్రమాదం ఉంటుంది.
- మీ ఇంట్లో తడిసిన, అతుకుల విద్యుత్తు తీగలు ఉంటే షార్ట్ సర్క్యూట్‌కు అయ్యే అవకాశముంటుంది. అందువల్ల ఏదైనా లోపం ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే ఎలక్ట్రీషియన్‌తో మార్పించుకోండి.
- రహదారిలో ఉండే విద్యుత్తు స్తంభాలు, సపోర్టు వైర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ తాకకూడదు. ఇంటి బయట ఉన్న ఎలక్ట్రికల్ పరికరాలను వాటర్ ప్రూఫ్ కవర్లతో కప్పి ఉంచండి. తద్వారా వాటిలోకి వర్షం నీరు చేరకుండా ఉంటుంది.
- ఇంట్లో ఎర్త్ లీకేజ్ సర్క్యూట్ బ్రేకర్ లేదా మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ ఉండేలా చూసుకోవాలి. ఇవి షార్ట్ సర్క్యూట్ లేదా లీకేజీ సమయంలో విద్యుత్ సరఫరాను నిలిపివేసేందుకు దోహదపడతాయి.
- మీరు బట్టలు ఆరబెట్టుకొనే తీగకు విద్యుత్తు తీగలు తగలకుండా చూడండి. తగలడానికి కాస్త అవకాశమున్నా తీసేయండి.
- విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద శబ్దం వస్తే వెంటనే విద్యుత్తు సంస్థ అధికారులకు సమాచారం ఇవ్వండి. ఇందుకోసం అత్యవసర నంబర్లను రాసి పెట్టుకోండి.
- వర్షం పడుతున్న సమయంలో వ్యవసాయ మోటార్లను ఆన్ చేయొద్దు.
- పిడుగులు పడే సమయంలో ఎలక్ట్రిక్ ఉపకరణాలను ఆఫ్ చేసి ప్లగ్‌లు తీసేయండి. వర్షాకాలంలో పిల్లలు తడి చేతులతో లేదా తడి నేలపై ఎలక్ట్రిక్ సామగ్రిని తాకకుండా జాగ్రత్తగా చూసుకోండి.
- వర్షం పడేటప్పుడు స్టే వైర్, విద్యుత్ తీగల కింద, ట్రాన్స్‌ఫార్మర్లకు దగ్గరగా ఉండొద్దు. పశువులను సైతం విద్యుత్ పరికరాలకు దూరంగా సురక్షితంగా ఉంచేలా చూసుకోండి.
- రోడ్లపై, నీటిలో విద్యుత్తు తీగలు పడి ఉంటే వాటిని తాకొద్దు. వాటిపై వాహనాలనూ నడిపే సాహసం చేయొద్దు. ఎక్కడైనా తీగలు తెగిపడితే సమీప విద్యుత్ సిబ్బందికి లేదా కంట్రోల్ రూం నంబర్లకు ఫోన్ చేసి చెప్పండి.
- ఎవరికైనా విద్యుత్ తీగలు తగిలి షాక్‌కు గురైతే రక్షించడానికి లోహపు వస్తువులు, ఇనుప రాడ్లను వాడొద్దు. చెక్క లేదా ప్లాస్టిక్‌తో చేసిన పరికరాలే ఉపయోగించండి.
- ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద మీరు అనధికారికంగా ఫ్యూజులు మార్చడం, మరమ్మతులు చేపట్టడం వంటివి చేయొద్దు.
ఆరోగ్యం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
- పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
- ఇంట్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. నీటి నిల్వతో డెంగీ బారిన పడే అవకాశాలుంటాయి.
- కలుషిత నీరు ( polluted water) తీసుకువడం వల్ల అనేక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. కాచి, వడకట్టిన నీళ్లు తాగాలని, వేడి ఆహారాన్ని తీసుకోవాలి.
- పానీపూరి లాంటి ఫుడ్ వల్ల టైఫాడ్ లాంటి జబ్బులు వస్తాయి. బయటి ఫుడ్ తినకపోవడం మేలు.
- జలుబు, జ్వరం తదితర లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
- వర్షాల కారణంగా రోడ్లు దెబ్బతింటున్నాయి. గర్భిణులు(pregnant women) బయటకు వెళ్లకపోవడం ఉత్తమం.