హైదరాబాద్‌లో కుంభవృష్టి
- రోడ్లు నదుల్లా..
- ట్రాఫిక్ జామ్‌తో స్తంభించిన నగరం
- ఈ సమస్యలకు పరిష్కారం ఎప్పుడో?
హైదరాబాద్, ఆంధ్రప్రభ : హైదరాబాద్ నగరంలో కురిసిన భారీ వర్షం(heavy rain) నగరాన్నిఅతలాకుతలం చేసింది. సాయంత్రం కురిసిన వర్షంతో రహదారులు నదుల్లా మారిపోయాయి. పలు కాలనీలు జలమయమయ్యాయి. వర్షపు ఉధృతికి ట్రాఫిక్ పూర్తిగా అస్తవ్యస్తమైంది. ప్రధానంగా ఆఫీసు టైంలో వర్షం కురవడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు ప్రాంతాల్లో వాహనదారులు(motorists) గంటల తరబడి ట్రాఫిక్‌లో నిలిచిపోయారు.
వర్షం మొదలవగానే రోడ్లు క్షణాల్లోనే నీటమునిగాయి. ఎక్కడ చూసినా వాహనాలు నీటిలో ఇరుక్కుపోయిన దృష్యాలే. నగరంలోని రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలతో పాటు ప్రధాన రహదారులు(roads) కూడా వరద నీటితో నిండిపోయాయి. ఒక గంట లేదా రెండు గంటలు ఆగకుండా వర్షం పడితే, అది నరకమే…
భారీ వర్షాలకు జలమయమైన రోడ్లు..
ప్రధాన రహదారులపై నీరు నిలిచిపోవడంతో భారీ ట్రాఫిక్ జామ్(traffic jams) ఏర్పడింది. ముఖ్యంగా బైకులు మధ్యలో ఆగిపోవడం, కార్లు ఇరుక్కుపోవడం, ఆటోలు రోడ్డు పక్కనే నిలిచిపోవడం వంటి దృశ్యాలు చాలా చోట్ల కనిపించాయి. దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
ఉప్పొంగిన డ్రైనేజీలు..
పంజాగుట్ట, అమీర్‌పేట్, ఎస్.ఆర్.నగర్, బంజారాహిల్స్(Banjara Hills), మియాపూర్ వంటి ప్రధాన రహదారులపై వాహనాలు ముందుకు కదలలేని పరిస్థితి నెలకొంది. బైక్‌పై ప్రయాణిస్తున్నవారు వర్షం, మురుగు నీరు(sewage), ట్రాఫిక్ సమస్యలను ఒకేసారి ఎదుర్కోవాల్సి రావడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వాహనాలు నిలిచిపోవడంతో రోడ్లన్నీహారన్ శబ్దాలతో మార్మోగిపోయాయి.
వర్షపు నీరు సక్రమంగా డ్రైనేజీల్లోకి వెళ్లకపోవడంతో పాటు, కొన్నిచోట్ల డ్రైనేజీల్లో(drainages) నుంచే మురుగు నీరు బయటకు వస్తుండటం పరిస్థితిని మరింత దారుణంగా మార్చింది. వర్షం ఆగిపోయిన గంటల తర్వాత కూడా రోడ్లపై నీరు తగ్గకపోవడంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. కొన్నిచోట్ల ట్రాఫిక్ పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించినా, ఆ మార్గాల్లో కూడా వాహనాల రద్దీ పెరగడంతో సమస్య జఠిలమైంది. ఫ్లైఓవర్లపై కూడా ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడటం గమనార్హం.
చిన్నచినుకు పడినా నగరంలోని వాహనాలు నిలిచిపోవడం, రోడ్లు జలమయం కావడం, మ్యాన్‌హోల్స్(manholes) పొంగిపోవడం, రోడ్లు చెరువులను తలపిస్తుండటంతో… ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లేదా అని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి వర్షాకాలంలోనూ ఈ పరిస్థితి పునరావృతం అవుతుండటంతో నగరవాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో అనేకసార్లు ఇలాంటి సమస్యలు ఎదురైనా, అధికారులు శాశ్వత పరిష్కారానికి ముందుకు రాలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అధికారుల అప్రమత్తం
ఇక వర్షం ప్రభావిత ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ సిబ్బంది, విపత్తు నిర్వహణ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. రోడ్లపై నిలిచిన నీటిని పంప్‌ల సాయంతో తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అత్యవసరంగా మున్సిపల్, GHMC అధికారులు (municipal contractors), ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తంగా మొహరించారు.
తాళ్లబస్తీలో అత్యధికంగా….
హైదరాబాద్‌లో వర్షపాతం గణనీయంగా నమోదైంది. ముషీరాబాద్ సర్కిల్ తాళ్లబస్తీలో అత్యధికంగా 19 సెంటీమీటర్ల వర్షపాతంను నమోదు చేసింది. చిలకలగూడ, బోలక్‌పూర్ పరిధిలో 15 నుంచి 18 సెంటీమీటర్ల మధ్య వర్షపాతం కురిసింది. బేగంపేట్, శేర్లింగంపల్లి పరిధిలో 15 సెంటీమీటర్లు నమోదైంది. జూబ్లీహిల్స్, చందానగర్, ఖైరతాబాద్ ప్రాంతాల్లో 11 నుంచి 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మూసాపేట్, పటాన్‌చెరు, కూకట్‌పల్లి, కాప్రా సర్కిళ్లలో 10 సెంటీమీటర్లు కురిసింది. యూసఫ్‌గూడ, కార్వాన్, కుత్బుల్లాపూర్(Qutubullahpur), మెహిదీపట్నం పరిధిలో 7–8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

