- రెండు గేట్లు ఎత్తి నీటి విడుదల
నంద్యాల బ్యూరో, (ఆంధ్రప్రభ) : నంద్యాల జిల్లాలోని శ్రీశైలం జలాశయం ఈ ఏడాది మరోసారి నిండుకుండలా మారింది. ఎగువ ప్రాంతాల నుండి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ జలాశయంలోకి ప్రవహిస్తుండటంతో అధికారులు జలాశయ గేట్లను ఎత్తి సాగరకు నీటిని విడుదల చేస్తున్నారు.
ప్రస్తుతం జలాశయంలోకి 76,739 క్యూసెక్కుల నీరు చేరుతోంది. ఇందులో జూరాల నుంచి 39,746 క్యూసెక్కులు, సుంకేశుల ప్రాజెక్టు నుంచి 36,975 క్యూసెక్కుల నీరు వస్తున్నాయి. పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం జలాశయం 883.70 అడుగులకు చేరుకుంది.
రెండు గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటి విడుదల
బుధవారం అధికారులు రెండు రేడియల్ క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేర పైకి ఎత్తి సాగరకు నీటిని వదులుతున్నారు. కుడి, ఎడమల జల విద్యుత్ ప్రాజెక్టుల ద్వారా 66,827 క్యూసెక్కుల నీటిని విద్యుత్ ఉత్పత్తికి వినియోగిస్తున్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ కుడి విద్యుత్ ప్రాజెక్టు 31,512 క్యూసెక్కులు, తెలంగాణ ఎడమ విద్యుత్ ప్రాజెక్టు 35,315 క్యూసెక్కులు వినియోగిస్తున్నాయి.
ఇది ఈ నెలలో రెండవసారి గేట్లను ఎత్తి నీరు వదిలే సందర్భం. గతంలో జూలై 8న సీఎం నారా చంద్రబాబు నాయుడు శ్రీశైలంలో కృష్ణమ్మకు జలహారతి ఇచ్చి నాలుగు గేట్లను ఎత్తి నీరు వదిలారు. తర్వాత వరద తగ్గడంతో జూలై 15న గేట్లను మూసివేశారు.
పర్యాటకుల రద్దీతో శ్రీశైలం శోభ
మహారాష్ట్ర, కర్ణాటకలో వర్షాలు ఎక్కువగా కురుస్తుండటంతో ఆల్మట్టి, తుంగభద్ర, జూరాల ప్రాజెక్టుల నుంచి అధికంగా నీరు వస్తోంది. జలాశయంలోని రెండు గేట్లు ఎత్తి నీరు వదిలే దృశ్యం పర్యాటకులను ఆకర్షిస్తోంది. శ్రావణ మాసం కావడంతో భక్తులు, పర్యాటకులు భారీగా చేరుకుంటున్నారు. ట్రాఫిక్ జామ్ నివారించేందుకు పోలీసులు క్రమబద్ధమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
మత్స్యకారులకు ముందే హెచ్చరికలు
నీటి విడుదల కారణంగా నదీతీర ప్రాంతాల మత్స్యకారులకు అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. జాగ్రత్తలు పాటించాలని సూచించారు.