కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 22 నుండి కొత్త జీఎస్టీ విధానాన్ని అమలు చేయనుంది. ఇప్పటివరకు ఉన్న నాలుగు స్లాబ్‌ల స్థానంలో, ఇకపై కేవలం 5%, 18% అనే రెండు స్లాబ్‌లు మాత్రమే ఉంటాయి. ఈ మార్పులతో సామాన్య ప్రజలకు నిత్యావసర వస్తువులపై పన్ను భారం తగ్గుతుంది.
ఈ కొత్త విధానం సినీ పరిశ్రమకూ ఈ నిర్ణయం కొంత ఊరట కలిగించనుంది. గతంలో రూ.100 లోపు ఉన్న సినిమా టిక్కెట్లపై 12% జీఎస్టీ ఉండేది, ఇప్పుడు అది 5%కి తగ్గింది. దీనివల్ల సింగిల్ స్క్రీన్ థియేటర్లలో తక్కువ ధర టిక్కెట్లు కొనే ప్రేక్షకులకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. అయితే, రూ.100 పైన ఉన్న టిక్కెట్లపై మాత్రం పాత పద్ధతిలోనే 18% జీఎస్టీ వర్తిస్తుంది. ఈ నిబంధన ఎక్కువగా మల్టిప్లెక్స్‌లకు వర్తిస్తుంది.
అయితే మరో కోణం కూడా ఉంది. ఇప్పటి వరకు థియేటర్లు పన్నును రౌండ్ ఫిగర్‌లో కలిపి రూ.150, రూ.200, రూ.300, రూ.400 వంటి రేట్లకే టికెట్లు విక్రయిస్తున్నాయి. కొత్తగా పన్ను తగ్గినా, ఈ సౌకర్యాన్ని ప్రేక్షకులకు అందిస్తారా లేదా మళ్లీ అదే రౌండ్ ఫిగర్ ధరలకే అమ్ముతారా అన్నది చూడాలి.
ఈ కొత్త విధానాన్ని సరిగ్గా అమలు చేస్తే, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టిక్కెట్ ధరలు తగ్గే అవకాశం ఉంది. లేకపోతే, పన్ను తగ్గడం వల్ల వచ్చే లాభం ప్రేక్షకులకు కాకుండా థియేటర్లకే పరిమితం కావచ్చునని సినీ విశ్లేషకులు అంటున్నారు.