ఆ విషయంలో చైతన్యం వచ్చిందా..?
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేసేందుకు చర్యలు తీసుకోవడం దుర్మార్గమని, వెంటనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే శిల్పారవిచంద్ర కిషోర్ రెడ్డి(Shilparavichandra Kishore Reddy), ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
వైఎస్ఆర్సిపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణ నిర్వహిస్తున్న నేపథ్యంలో నేడు పట్టణంలోని గాంధీ చౌక్ సెంటర్ లో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పట్టణ ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి తమ మద్దతును తెలియజేశారు.
మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలలను పీపీపీ విధానంలో ప్రవేట్ వ్యక్తులకు దారాదత్తం చేయడం దుర్మార్గమైన చర్య అన్నారు. ఇటువంటి నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి(YS Jaganmohan Reddy) దూర దృష్టితో పేద, మధ్యతరగతి పిల్లల బంగారు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వైద్య విద్యను చేరువ చేసేందుకు రాష్ట్రంలో నూతనంగా 17 మెడికల్ కళాశాలలకు కేంద్ర ప్రభుత్వం ఎన్ ఏం సి ద్వారా అనుమతులను తీసుకురావడం జరిగిందన్నారు.

అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మిగతా 12 మెడికల్ కళాశాలల నిర్మాణాలను పూర్తి చేసి ప్రారంభించేందుకు చర్యలను తీసుకోవడం లేదన్నారు. దుర్మార్గంగా పేదవారి పిల్లలకు వైద్య విద్య దూరం చేసేందుకు కుట్రలు పన్ని పీపీపీ(PPP) విధానం ద్వారా ప్రైవేటు వ్యక్తులకు మెడికల్ కళాశాల నిర్వహణను అప్పజెప్పేందుకు నిర్ణయాన్ని తీసుకోవడం జరిగిందన్నారు.
కోటీ సంతకాల సేకరణ నిర్వహించి మెడికల్ కళాశాలలను ప్రైవేటుపరం చేయకుండా అడ్డుకునేందుకు రాష్ట్ర గవర్నర్(State Governor)కు వినతి పత్రం ఇస్తామన్నారు. ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి ప్రజల్లో చైతన్యం వచ్చిందని.. అందుకనే స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ నెంబర్ పిపి నాగిరెడ్డి, గోపవరం సాయినాథ్ రెడ్డి, దేశం సుధాకర్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ మాబున్నిసా, దాల్మిల్ అమీర్, వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్ , మండలం ఎం పీపీ శేట్టి ప్రభాకర్(MPP Shetty Prabhakar), శశికళా రెడ్డి, సోమశేఖర్ రెడ్డి రసూల్, అనిల్ అమృత రాజ్ తదితరులు పాల్గొన్నారు.

