Kunamneni: స్థానిక ఎన్నికల్లో హస్తం పార్టీకి ఇబ్బందులు తప్పవు..

హైదరాబాద్ – అధికార కాంగ్రెస్‌ పార్టీకి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇబ్బందులు తప్పవని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఇప్పటి వరకు నెరవేర్చలేకపోయిందని కామెంట్ చేశారు. దీంతో ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం సన్నగిల్లుతోందన్నారు.

ప్రజలకు ఇచ్చిన హామీలపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హామీలపై కాంగ్రెస్ పార్టీ వివరణ ఇచ్చిన తరువాతే స్థానిక ఎన్నికలకు వెళితే బాగుంటుందని సీపీఐ తరఫున హస్తం పార్టీకి సూచిస్తున్నామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బలంగా ఉన్న చోటే తాము పోటీ చేస్తామని.. మిగతా చోట్ల కాంగ్రెస్ పార్టీని కలుపుకుపోతామని కూనంనేని తెలిపారు.

అదేవిధంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు ఇస్తున్నామని స్పష్టం చేశారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీల అభ్యర్థుల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనే దానిపై పార్టీలో చర్చలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణన చేయడాన్ని తమ పార్టీ స్వాగతిస్తోందన్నారు. మావోయిస్టులను ఎన్‌కౌంటర్ల పేరుతో అత్యంత దారుణంగా చంపేస్తున్నారని.. ఆ అంశంపై ప్రభుత్వం న్యాయ విచారణ జరిపించాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *