ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు (MLA Guvwala Balaraju) బీజేపీలో చేరారు. ఆదివారం నాడు హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు బాలరాజుకు కాషాయ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. గువ్వలతో పాటు ఆయన అనుచరులు, నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు కూడా బీజేపీ (BJP) సభ్యత్వం స్వీకరించారు. కొన్ని రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీ (BRS Party)కి రాజీనామా చేసినప్పటి నుంచి గువ్వల బాలరాజు ఏ పార్టీలో చేరతారనే దానిపై తీవ్రమైన చర్చ నడిచింది. గతంలో తనపై దాడి జరిగినప్పుడు పార్టీ నాయకత్వం అండగా నిలవలేదని, తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని ఆయన బీఆర్ఎస్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీని వీడగా, తాజాగా బీజేపీలో చేరడంతో ఊహాగానాలకు తెరపడింది.
బీజేపీ వైపు తెలంగాణ ప్రజల చూపు : పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు
ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీని ప్రత్యామ్నాయంగా చూస్తున్నారని అన్నారు. గువ్వల బాలరాజు కూడా ఆ విషయాన్ని ముందుగానే గుర్తించి రావడం అభినందనీయమని అన్నారు. అచ్చంపేటతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ అభివృద్ధికి గువ్వల బాలరాజు కృషి చేస్తారని ఆశిస్తున్నామని అన్నారు. త్వరలో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయి. ఈ ఎన్నికల్లో మన సత్తా ఏంటో చూపించాలని పార్టీ శ్రేణులకు రాంచందర్ రావు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)కి మోడీని విమర్శించే స్థాయి లేదని మండిపడ్డారు. మళ్లీ ఓటమి తప్పదనే విషయాన్ని రాహుల్ ముందే గుర్తించారని.. అందుకే ఈసీపై, మోడీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని సీరియస్ అయ్యారు.
బీజేపీ బలోపేతానికి కృషి : బాలరాజు
అనంతరం గువ్వల బాలరాజు మాట్లాడుతూ.. మోడీ పాలన, ఎన్డీఏ ప్రభుత్వ పనితీరు నచ్చే బీజేపీలో చేరానని అన్నారు. రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయడమే కాకుండా అభివృద్ధిలోకి తీసుకొచ్చేందుకు తన వంతు పాత్ర పోషిస్తానని చెప్పారు. అంతకుముందు మాట్లాడుతూ.. ‘కేటీఆర్(KTR) నాకంటే పెద్దోడేమీ కాదు. ఆయన విదేశాల్లో చదువుకున్నాడేమో కానీ నాకున్న అనుభవం కేటీఆర్‌కు లేదు. రాబోయే రోజుల్లో నేనేంటో కేటీఆర్‌కు చూపిస్తా. గ్రామాల్లో కూడా అడుగుపెట్టనివ్వను’ అని గువ్వల బాలరాజు హాట్ కామెంట్స్ చేశారు.