Guntur | మిర్చి రైతులతో జగన్ మమేకం – రైతుల పరిస్థితి దయనీయమంటూ ఆవేదన
గిట్టుబాటు ధర లభించక ఆందోళన
గుంటూరు మిర్చి యార్డ్ ను సందర్శించిన మాజీ సీఎం జగన్
మిర్చి రైతులకు సంఘీభావం ..
వారి కష్టాలు అడిగి తెలుసుకున్న జగన్
ఉమ్మడి గుంటూరు, ఆంధ్రప్రభ బ్యూరో: గిట్టుబాటు ధర లభించక మిర్చి రైతులు విలవిల్లాడి పోతున్నారని, కూటమి ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో అన్ని విధాలా విఫలమైందని వైఎస్సార్సీపి అధినేత మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. మిర్చి రైతులకు గిట్టుబాటు ధర లభించక అయిన కాడికి అమ్ముకొని నష్టాల పాలవుతున్నారని, కనీసం ఈ జిల్లాలో యార్డుకు కూతవేటు దూరంలో ఉన్న సీఎం చంద్రబాబుకు వారి కష్టాలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఇంటికి సచివాలయానికి వెళ్తున్నారే కానీ రైతుల కష్టాల గురించి ఆలోచించడం లేదని ఆరోపించారు. గత కొద్ది రోజులుగా మిర్చి ధరలు పతనమై రైతులు గగ్గోలు పెడుతుంటే వారి ఆవేదన ఆయన చెవికి చేరడం లేదా అని జగన్ నిలదీశారు.
మిర్చి యార్డుకు వస్తున్నారన్న సమాచారంతో వైసిపి శ్రేణులు భారీగా తరలివచ్చారు. ఈ దశలో గుంటూరు -చిలకలూరిపేట ప్రధాన రహదారిపై సుమారు గంటపాటు రాకపోకలకు అంతరాయం కలిగింది. భారీగా తరలివచ్చిన వైసీపీ శ్రేణులు జగన్ ను కలిసేందుకు పోటీపడ్డారు. ఒక దశలో ఎమ్మెల్సీ కోడ్ అమల్లో ఉన్నందున అనుమతి ఇస్తారా లేదా అన్న సందేహం కలిగింది. అయితే మాజీ సీఎం జగన్ యాడ్ ను సందర్శించేందుకు ప్రభుత్వము ఎటువంటి ఆటంకాలు సృష్టించలేదు.
ఈ సందర్భంగా మాజీ సీఎం జగన్ మీడియాతో మాట్లాడుతూ కూటమి సర్కార్ రైతులను దగా చేసిందన్నారు. అధికారం చేపట్టి ఎనిమిది నెలలైనా రైతులకు భరోసా ఇవ్వలేకపోయింది అన్నారు. కనీసం గిట్టుబాటు ధర కల్పించకపోగా ఖరీఫ్లో వారికి అందాల్సిన పెట్టుబడి సాయం కూడా ఇవ్వలేకపోయిందన్నారు. తమ ప్రభుత్వం హయాంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులను అన్ని విధాల ఆదుకోవడంతోపాటు వారికి అవసరమైన విత్తనాలు ఎరువులు పురుగుమందులు దిగుబడి ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించామని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు రైతుల కష్టాలు కనిపించడం లేదని వారి బాధల పట్ల కనీస కనికరం లేదన్నారు. ఆరుగాలము శ్రమించి పంటలను సాగు చేసి ఉత్పత్తులను విక్రయించుకునేందుకు మార్కెట్ కమిటీలకు వస్తే వారి ని ఆదుకోవాల్సిన ప్రభుత్వం వారి పట్ల దారుణంగా వ్యవహరిస్తుందన్నారు.
రైతుల పట్ల కూటమి సర్కార్ వ్యవహరిస్తున్న తీరును మాజీ సీఎం జగన్ ఎండగట్టారు రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోవడంపై ప్రభుత్వాన్ని నిలదీయాలని ప్రజలకు సూచించారు. ప్రతిపక్షం పై చంద్రబాబుకున్న కక్ష సాధింపు చర్యలు రైతులకు మేలు చేయడంలో లేదని విమర్శించారు. రాజకీయ దురుద్దేశంతో వైసిపి శ్రేణులను ఇబ్బంది పెట్టాలని చూస్తే మరింత ఉత్సాహంతో ముందుకు పోతారని హెచ్చరించారు. ఎల్లకాలము ప్రభుత్వము ఇదే ఉండదని తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎవ్వరిని వదిలిపెట్టబోమని అణా పైసా తో సహా తీర్చుకుంటామని గుర్తు చేశారు. తనను మిర్చి యార్డు సందర్శించకుండా అడ్డంకులు సృష్టించారని కనీసము ప్రతిపక్ష నేతకు ఇవ్వాల్సిన భద్రత కూడా కల్పించలేకపోయారని ఆరోపించారు. ఇవన్నీ తాము గుర్తుపెట్టుకుంటామని అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమి చేయాలో తమకు తెలుసని జగన్ హెచ్చరించారు.
మిర్చి యార్డులో రైతులను స్వయంగా కలిసి ధరల గురించి ఆరా తీశారు. రైతులు తమకు గిట్టుబాటు ధర లభించడం లేదని జగన్ ఎదుట వాపోయారు. గతంలో మేలు రకం మిర్చి వెంట 18000 నుంచి 20 వేల వరకు కొనుగోలు చేసేవారని ప్రస్తుతము పదివేలకు కూడా కొనే పరిస్థితి లేదని రైతులు తమ కష్టాలను జగన్ ఎదుట వెలిబుచ్చారు. యార్డులో రైతులకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదని మరికొందరు రైతులు జగన్ దృష్టికి తీసుకువచ్చారు. రైతులకు సీజన్లో మధ్యాహ్నం భోజనం కూడా సరిగా కొనసాగించాకపోతున్నారని మరికొందరు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మిర్చి ఘాటు భరిస్తూ రైతులతో సుమారు అర్థగంట పాటు జగన్ ముఖాముఖి నిర్వహించి వారి కష్టాలను తెలుసుకున్నారు.









