Guntur | విద్యార్థుల సంఖ్య తగ్గడం ఆందోళనకరం

Guntur | విద్యార్థుల సంఖ్య తగ్గడం ఆందోళనకరం
- ఎమ్మెల్సీ ఆలపాటి రాజా
- ఏపీటీఎఫ్ విద్యా సదస్సులో ఉపాధ్యాయ సమస్యలపై చర్చ
Guntur | గుంటూరు, ఆంధ్రప్రభ : ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎంతో అంకితభావంతో పనిచేస్తున్నప్పటికీ, ఏటా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుండటం ఆందోళనకరమని గుంటూరు – కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ అన్నారు. ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ ఉద్యమ నేత నూతలపాటి పరమేశ్వరరావు వర్ధంతి సందర్భంగా ఈ రోజు విద్య ప్రైవేటీకరణ – ఆర్థిక అసమానతలు అనే అంశంపై నిర్వహించిన విద్యా సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆలపాటి మాట్లాడుతూ.. సమాజంలో ఉపాధ్యాయ వృత్తి అత్యంత పవిత్రమైనదని, వారికి సాటి మరొకరు లేరని కొనియాడారు. గత 78 ఏళ్లుగా తన నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి, విద్యారంగ అభివృద్ధికి, ఉపాధ్యాయ సంక్షేమానికి ఏపీటీఎఫ్ చేస్తున్న పోరాటం అభినందనీయమన్నారు. ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా కృషి చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. సదస్సులో ప్రధాన వక్తగా పాల్గొన్న ప్రముఖ ఆర్థిక విశ్లేషకుడు డి. పాపారావు మాట్లాడుతూ… నేటి ఆర్థిక అసమానతల సమాజంలో మనిషి తన విలువను కోల్పోయి కేవలం ఒక సరుకుగా మారిపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు.
పెట్టుబడిదారీ వ్యవస్థలో కార్మికుల శ్రమను దోపిడీ చేస్తూ, వారిని కనీసం జీతం కూడా అడగలేని దైన్య స్థితిలోకి నెడుతున్నారని విమర్శించారు. ఏపీటీఎఫ్ రాష్ట్ర నేతలు చెన్నుపాటి మంజుల, కె. భానుమూర్తి మాట్లాడుతూ.. 12వ పీఆర్సీ అమలు, డీఏ విడుదల, పెండింగ్ బకాయిలు, సీపీఎస్ రద్దు వంటి కీలక సమస్యలపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పాకాలపాటి రఘువర్మ, షేక్ జిలాని, పి. పాండురంగ వరప్రసాదరావు, వి. హనుమంతరావులతో పాటు పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొని నూతలపాటి పరమేశ్వరరావు చిత్రపటానికి నివాళులర్పించారు. సభకు ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు కె. బసవలింగారావు ఆహ్వానం పలకగా, జిల్లా ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఖాలీద్ వందన సమర్పణ చేశారు.
