Pakistan | బస్సుపై ముష్కరుల దాడి.. ఏడుగురు మృతి !
పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. లాహోర్ వెళ్తున్న ప్యాసింజర్ బస్సుపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఆ బస్సులో 45 మంది ప్రయాణికులు ఉండగా, అందులో ఏడుగురు ప్రయాణికులను హతమార్చారు.
మృతులంతా పంజాబ్ ప్రావిన్స్‌కు చెందిన వారిగా గుర్తించారు అధికారులు. పంజాబ్‌లోని డేరా గజఖాన్ నుంచి బలూచిస్థాన్‌లోని బర్ఖాన్‌ను కలిపే ప్రధాన రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘోరమైన ఘటన పంజాబ్, బలూచిస్థాన్ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేసింది.
ఈ ఘటనపై అసిస్టెంట్ కమిషనర్ ఖదీం హుస్సేన్ వివరించారు. కాల్పులు జరిపిన వ్యక్తులు, దాడి వెనుక ఉద్దేశ్యం ఇంకా తెలియరాలేదన్నారు. ఈ ఘటనకు ఇప్పటి వరకు ఏ సంస్థ బాధ్యత వహించలేదని పేర్కొన్నారు.
కాగా, ప్రయాణికులు తమ ప్రయాణాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే భద్రతా బలగాలు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. పరిసర ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. పంజాబ్, బలూచిస్థాన్ రాష్ట్రాల సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు అధికారులు తెలిపారు.