వర్జీనియా – అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ తూటా పేలింది. వర్జీనియాలోని స్పాట్సిల్వేనియా కౌంటీలో మంగళవారం సాయంత్రం జరిగిన కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు మరణించగా, మరో ముగ్గురు గాయపడ్డారని అధికారులు తెలిపారు. స్పాట్సిల్వేనియా షెరీఫ్ కార్యాలయ ప్రతినిధి మేజర్ ఎలిజబెత్ స్కాట్ మాట్లాడుతూ వాషింగ్టన్ డీసీకి నైరుతి దిశలో 105 కిలోమీటర్లు దూరంలో ఉన్న స్పాట్సిల్వేనియా కౌంటీలోని ఓ నివాస సముదాయంలో సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో కాల్పుల ఘటన జరిగిందని తెలిపారు.
ఆ తర్వాత 911 ద్వారా సమాచారం అందిందని.. వెంటనే అధికారులు రంగంలోకి దిగి దర్యాప్తును ప్రారంభించారని చెప్పారు. అనుమానితుల కోసం పోలీసులు వెతుకుతున్నారని పేర్కొన్నారు. కాల్పులు జరిగిన చోట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
ఈ ఘటనలో ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదని.. కాల్పులు జరిగిన ప్రాంతానికి ప్రజలు దూరంగా ఉండాలని సూచించారు.