Gudivada | వైకుంఠ ఏకాదశి శోభ..
Gudivada, ఆంధ్రప్రభ : గుడివాడ పట్టణంలోని వైష్ణవ దేవాలయాల్లో మంగళవారం తెల్లవారుజాము నుండి వైకుంఠ ఏకాదశి శోభ నెలకొంది. ముక్కోటి ఏకాదశి పర్వదిన వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ప్రసిద్ధిగాంచిన జగన్నాధపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో స్వామివారు ఉత్తర ద్వారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు ఉత్తర ద్వారా దర్శనాన్ని ప్రారంభించి భక్తులతో కలిసి స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు వేలాదిగా వచ్చిన భక్తులకు దేవాదాయ శాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తెల్లవారుజాము మూడు గంటల నుండి క్యూ లైన్లలో భక్తులు బారులు తీరారు.
వేద పండితులు, వేదాంతం అప్పలాచారి ఉత్తర ద్వారంలో దర్శనమిచ్చిన ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దేవస్థానంలో ముత్యాల అంగీ అలంకరణలో స్వామివారు భక్తులకు దర్శనం ఇచ్చారు. అంగరంగ వైభవంగా జరుగుతున్న ముక్కోటి ఏకాదశి వేడుకల్లో పాల్గొనడం సంతోషకరమని రావి వెంకటేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. ప్రజలందరి పై స్వామివారి దీవెనలు ఉండాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. అనంతరం మున్సిపల్ మాజీ ప్రతిపక్ష నేత భక్తులకు ప్రసాదంగా అందిస్తున్న పాలు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన రావి భక్తులకు అందించారు. ఉత్తర ద్వార దర్శనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీనియర్ టీడీపీ నాయకులు చేకూరు జగన్మోహన్రావు దంపతులు, దేవస్థానం ఈవో కందుల గోపాలరావు, ఉత్సవ కమిటీ చైర్మన్ లింగం శివరామ ప్రసాద్, కమిటీ సభ్యులు, ఆండాళ్ గోష్టి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

