అహ్మదాబాద్ వేదికగా నేడు జరిగిన రసవత్తరపోరులో గుజరాత్ టైటన్స్ విజయం సాధించింది. హోం గ్రౌండ్ లో రాజస్థాన్ తో తలపడిన గుజారత్.. 58 పరుగుల తేడాతో రాయల్స్‌ను చిత్తు చేసింది. దీంతో వరుసగా నాలుగో విజయాన్ని తమ ఖాతాలో వేసుకున్న గుజరాత్… 8 పాయింట్స్‌తో పాయింట్ల పట్టికలో అగ్ర స్థానానికి దూసుకెళ్లింది.
218 పరుగుల భారీ టార్గెట్ తో ఛేజింగ్ కు దిగిన రాజస్తాన్ రాయాల్స్ 19.2 ఓవర్లలో 159 పరుగులే చేసి ఈ సీజన్‌లో మూడో పరాజయాన్ని చవిచూసింది.
విజృంభించిన గుజరాత్ బౌలర్లు..
218 పరుగుల భారీ ఛేదనకు దిగిన రాజస్తాన్ రాయల్స్… 159 పరుగులకు ఆలౌటైంది. ఈ ఛేదనలో ఆర్ఆర్‌కు ఆరంభంలోనే భారీ ఎదురుదెబ్బలు తగిలాయి. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (6), ప్రమాదకర బ్యాటర్ నితీష్ రాణా (1) ఔటయ్యారు. దీంతో రాజస్తాన్ 12 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది.
ఈ దశలో కెప్టెన్ సంజూ శాంసన్ (41), రియాన్ పరాగ్ (14 బంతుల్లో 26) తమ జట్టును ఆదుకునేప్రయత్నం చేశారు. శాంసన్ ఆచితూచి ఆడుతుంటే పరాగ్ మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ క్రమంలో వీరిద్దరు మూడో వికెట్‌కు 48 పరుగులు జోడించారు. తర్వాత వచ్చిన ధ్రువ్ జురేల్ (5) స్వల్ప పరుగులకే ఔటయ్యాడు, దీంతో రాజస్తాన్ 68 స్కోరుకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఈ సమయంలో సంజూతో కలిసి షిమ్రోన్ హెట్‌మయర్ (32 బంతుల్లో 52) రాయల్స్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశాడు. ఇద్దరూ కూడా ధాటిగా ఆడతూ.. 48 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. సంజు ఔటన స్వల్ప వ్యవధిలోనే హెట్‌మయర్ కూడా పెవలియన్ చేరాడు. ఆ తరువాత టేయిలెండర్లు సింగిల్ డిజిట్ కే వికెట్లు పారేసుకున్నారు. దాంతో రాజస్థాన్ కు ఓటమి తప్పలేదు.
గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 3, రషీద్ ఖాన్ 2, మహ్మద్ సిరాజ్, అర్షద్ ఖాన్, కుల్వంత్ ఖేజ్రోలియా, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
రాణించిన సాయి, బట్లర్..
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన జీటీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (82; 53 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్ సెంచరీతో మెరిశాడు. బట్లర్ (36; 25 బంతుల్లో 5 ఫోర్లు) ఆకట్టుకున్నాడు.
తర్వాత వచ్చిన ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్ 4 బంతుల్లోనే 12 పరుగులు చేసి అదే ఓవర్లో వెనుదిరిగాడు. ఇక ఆఖరి ఓవర్లో రాహుల్ తెబాటియా (24 నాటౌట్; 12 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) భారీ షాట్లు ఆడటంతో టైటాన్స్ నిర్ణీత ఓవర్లలో 217/6 స్కోరు సాధించింది.
రాజస్తాన్ బౌలర్లలో తుషాద్ దేశ్‌పాండే, మహీశ్ తీక్షణ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. జోఫ్రా ఆర్చర్, సందీప్ శర్మ తలా వికెట్ దక్కించుకున్నారు.